తాము ఏపీలో అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ అన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్క రోజు ముందు పవన్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఇప్పటికే ఆందోళన రెట్టింపైంది. తమకు అధికారం లభిస్తుందో, రాదోనని నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో అటు వైకాపా నాయకులు కొంత ఉత్సాహంగానే ఉన్నారు. కానీ అధికార పార్టీ టీడీపీ నేతల్లో ఎక్కడో చిన్న ఆందోళన ఉంది. ఇక మరొక పార్టీ జనసేన అయితే తాము ఫలితాన్ని ముందుగానే ఊహించామన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఆ పార్టీ అధినేత ఇవాళ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాము ఏపీలో అధికారంలోకి వస్తామని గానీ, తాను సీఎం అవుతానని గానీ నిశ్చయంగా లేరు. అసలు ఇప్పటి వరకు ఆ తరహా వ్యాఖ్యలు కూడా పవన్ చేయలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ పెట్టిన ఆందోళనో, మరొకటో తెలియదు కానీ.. పవన్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీలో అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ అన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్క రోజు ముందు పవన్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు స్పష్టమవుతున్నవి రెండే అంశాలు.. పవన్ ఏపీలో అధికారంలోకి వస్తామని అన్నారు కనుక.. తాము పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తామని పవన్ నమ్మకం అయి ఉండవచ్చు. కానీ అది కచ్చితంగా జరగదు. ఎందుకంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. అయితే ఆ ఫలితాలు తారుమారు అయితే టీడీపీ అధికారంలోకి వస్తుంది కానీ.. జనసేన కాదు కదా.. కనుక పవన్ పార్టీకి మెజారిటీ లభించడం, అధికారంలోకి రావడం అనే మాటే లేదు. ఇక రెండో అంశం.. ఏపీలో హంగ్ రావడం. అప్పుడు కర్ణాటకలో జేడీఎస్‌లా ఏపీలో జనసేన ఏదో ఒక పార్టీకి మద్దతిస్తుంది. అలాగే కుమార స్వామిలా పవన్ ఇక్కడ సీఎం అవుతారు.
అయితే ఏపీలో హంగ్ వచ్చేందుకు అవకాశాలు కూడా చాలా తక్కువే. ఆ రాష్ట్రంలో టీడీపీ లేదా వైసీపీలలో ఏదో ఒక పార్టీకి కచ్చితంగా సంపూర్ణ మెజారిటీ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ తాము అధికారంలోకి వస్తామని ఎలా కామెంట్ చేశారు..? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికి అన్నీ అంచనాలు మాత్రమే కనుక.. రేపు ఫలితాలు వెలువడే దాకా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం మనం ఇప్పుడే చెప్పలేం. అందుకు రేపటి వరకు ఆగాల్సిందే..!