ఎడిట్ నోట్: మునుగోడు మెయిన్ గేమ్..!

-

మునుగోడులో అసలు ఆట ఇప్పుడు మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటివరకు నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల ప్రక్రియ లాంటివి జరిగాయి. ఇక తాజాగా నామినేషన్ల పరిశీలన కూడా ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో..మునుగోడులో బరిలో ఎంతమంది అభ్యర్ధులు నిలిచారో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 83 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో 36 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. చివరికి 47 మంది బరిలో నిలబడ్డారు.

అయితే 47 మంది ఉండటంతో మూడు ఈవీఎం యూనిట్లతో ఉప ఎన్నిక జరగనుంది. ఇక వీరిలో ఎంతమంది అభ్యర్ధులు సైలెంట్ అయిపోతారో కూడా చూడాలి.  ఎంతమంది బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్యే జరగనుంది. ఇక్కడ నుంచి ఎన్నికల రోజు వరకు మునుగోడులో అసలు పోలిటికల్ గేమ్ నడవనుంది. ఇప్పటికే గెలవడానికి అన్నిరకాల ప్రయత్నాలు పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీలు ఎంత ఖర్చు పెడుతున్నాయో కూడా లెక్క లేకుండానే పోయింది. ఓటర్లకు తాయిలాలు, విందు, మందు అబ్బో..ఎన్నిక అయ్యేవరకు మునుగోడు ఓటర్లకు పండుగే.

ఇక గెలవడానికి ఇతర పార్టీల నేతలని కొనుగోలు ప్రక్రియ నడుస్తోంది. నేతలు కూడా ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీలోకి జంప్ కొట్టేస్తున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడింది. అసలు మునుగోడులో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలనే టీఆర్ఎస్-బీజేపీలు టార్గెట్ చేశాయి.  పంచాయితీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున 74 మంది సర్పంచ్‌లు గెలుపొందగా.. ప్రస్తుతం ఆ పార్టీలో నలుగురికి మించి లేరంటే.. ఏ స్థాయిలో నేతల కొనుగోళ్లు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణకు మునుగోడు మండలం కాంగ్రెస్‌కు కంచుకోట..ఇక్కడ 16 మంది కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలిచారు. కానీ ఇప్పుడు ఇందులో 8 మంది టీఆర్ఎస్, 8 మంది బీజేపీ వైపుకు వెళ్లారు అంటే.. పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే తమ కార్యకర్తల బలాన్ని నమ్ముకుని కాంగ్రెస్ ముందుకెళుతుంది. డబ్బుల రేసులో కాంగ్రెస్ వెనుకబడింది. మొత్తానికి మునుగోడు దక్కించుకునే రేసులో టీఆర్ఎస్-బీజేపీలు ముందున్నాయి..మరి మునుగోడు ప్రజలు చివరికి ఎవరి వైపు నిలబడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news