నేడు విశాఖలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ సాయంత్రానికి తెలంగాణాకి రానున్నారు. మోడీ పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే వామపక్షాల నేతలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌లో పలుచోట్ల మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం, సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఈ క్రమంలో పలువురు వామపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరిఖనిలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ నేత సీతరామయ్యతో పాటు పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే ప్రజా సంఘాలు, బొగ్గుగని కార్మిక సంఘం నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో కూడా పలువురు వామపక్ష నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొందరిని గృహ నిర్బంధం చేశారు. అరెస్ట్ చేసిన వామపక్ష నేతలను మంచిర్యాల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు రామగుండంలో కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో పలుచోట్ల టీబీజీకేఎస్, ఇతర కార్మిక సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.