TRS నేతలు గుండాలు, పిరికిపందలు అని వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. మేం పాదయాత్ర చేస్తుంటే.. ఫలితం పెట్రోల్ తో దాడులు, పోలీసులతో అక్రమ అరెస్టులా? నిస్వార్థంగా 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తున్న ఒక మహిళకి మీరు ఇచ్చే బహుమతి ఇదా? దాడి చేపించడానికి KCRకు సిగ్గుండాలని చురకలు అంటించారు.
కనీసం పెద్ద మనిషి అనే ఇంగితం కూడా KCRకు లేదు. ఒకప్పుడు ఉద్యమకారులైన టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు ఇప్పుడు గూండాల్లా తయారయ్యారు. ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేక, పిరికిపందల్లా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు.
పోలీసులు కేసీఆర్ కు జీతగాళ్లలా మారారు. దాడులు చేస్తున్న టీఆర్ఎస్ గూండాలను కాపాడి, మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి టీఆర్ఎస్ రౌడీలు అడుగడుగునా పాదయాత్రను అడ్డుకుంటున్నా పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.