లైగర్ సినిమా వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొన్నటి మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పాటు, నటి ఛార్మీలను అధికారులు విచారించారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. సుమారు12 గంటలపాటు కొనసాగిన విచారణలో పూరీ, ఛార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాకుండా మొన్న.. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండను కూడా ఈడీ విచారించింది. లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ ఇంకా కొనసాగుతుంది. పూరి కనెక్ట్ కి ఎల్ ఎల్ పి కి 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది.
100 బినామీ అకౌంట్లో నుంచి ఈ నగదు బదిలీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. లైగర్ సినిమాకు పది కోట్ల రూపాయలు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు గుర్తించింది. విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే లైగర్ సినిమాకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వెనక మతలబు ఏంటో ఆరా తీస్తోంది ఈడీ. లైగర్ సినిమా పెట్టుబడులకు, రాజకీయ పార్టీ నేతలకు ఉన్న సంబంధాలపై పరిశీలిస్తోంది ఈడీ.