మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబ అంధారి పులుల అభయారణ్యంలో నాలుగు పులి పిల్లలు మృతి చెందాయి. వీటిలో రెండు ఆడ, రెండు మగ పిల్లలు ఉన్నాయి. వాటి మృతదేహాల్ని శనివారం ఉదయం గుర్తించారు అటవీ అధికారులు. ఈపులి పిల్లలు దాదాపు 3 నుంచి 4 నెలల వయసు ఉంటాయని, షియోని అటవీ ప్రాంతంలోని 265వ నంబర్‌లో వాటి శరీరం మీద కొరికిన గాయాలు ఉన్నాయన్నారు అటవీ అధికారులు. అయితే.. అవి పులి దాడిలో చనిపోయు ఉండవచ్చని అటవీ అధికారులు తెలిపారు.
మూడో రోజుల క్రితం షియోని అటవీ ప్రాంతంలో వీటి తల్లి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆ ప్రదేశానికి దగ్గర్లోనే 4 పులి పిల్లల మృతదేహాలు కనిపించాయి. శుక్రవారం ఆ ప్రాంతంలో మగ పులి సంచరించినట్టు సీసీ టీవీలో కనిపించింది. దాంతో వీటిని ఆ మగ పులి చంపేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులి పిల్లల మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం చంద్రపూర్‌లోని వెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. తడోబా టైగర్ రిజర్వ్ మనదేశంలోనే పురాతనమైనది. 1,727 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇందులో దాదాపు 120కి పైగా పులులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చిరుత పులులు, అడవి బర్రెలు, హైనాలు కూడా ఉన్నాయి.