ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం వచ్చారు. అయితే ఖమ్మం సభ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మాదిరిగా లేదు..కేవలం బీజేపీపై విమర్శలు చేస్తూనే సభ నడుస్తుంది. మొదట ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతో కలిసి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రారంభించారు.
ఇక సభ వద్దకు చేరుకుని..వరుసపెట్టి జాతీయ నాయకులు బీజేపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. బీజేపీపై కేసీఆర్ పోరాటానికి మద్ధతిస్తామని, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావల్సిన అవసరం ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. కేంద్రానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచి మొదలైందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ..ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందని, విపక్ష పార్టీల నేతలను కేసులపేరుతో ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. నరేంద్ర మోడీకి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి అతి పెద్ద ముప్పు అని సిపిఐ నేత డి రాజా ఫైర్ అయ్యారు.
ఇక బీజేపీ వ్యతిరేక పోరాటం ఖమ్మం జిల్లా నుంచే షురూ అయిందని, బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ అంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఫైర్ అయ్యారు. మొత్తానికి ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కాస్త బీజేపీని విమర్శించే సభాగా మారిపోయింది.