తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ శ్రేణులని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని బిజేపి కష్టపడుతున్న విషయం తెలిసిందే. కేసిఆర్ ప్రభుత్వంపై పోరాడుతూనే..బిజేపి బలం పెంచేలా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలని పార్టీలోకి లాగడానికి చూస్తున్నారు.
అయితే మరో 9 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ 2023లో ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే మాత్రం సీన్ మొత్తం మారిపోతుంది. ఎక్కువ శాతం కేసిఆర్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇటీవల కూడా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..కేసిఆర్ ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏప్రిల్ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నారని, అందుకే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించడం లేదని అంటున్నారు.
రేవంత్ చెప్పడం ఏమో గాని బడ్జెట్ సమావేశాల తర్వాత కేసిఆర్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని బిజేపి ఎక్కువ నమ్ముతుంది. అందుకే ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు వస్తున్న మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది. సికింద్రాబాద్ లో పలు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించిన తర్వాత..బిజేపి ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ సభకు మోదీ హాజరవుతారు. అక్కడే ఎన్నికల హామీలు ఇవ్వనున్నారని, అలాగే ఎన్నికల్లో కేసిఆర్‌ని ఎలా ఎదురుకోవాలి, చెక్ పెట్టే విషయంపై బిజేపి శ్రేణులని దిశానిర్దేశం చేస్తారని టాక్.
అటు తెలంగాణలో పొత్తుల అంశం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీతో పాటు జనసేనతో కూడా పొత్తు ఉండదని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. కానీ ఈ విషయంపై పార్టీ అధినాయకత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చే మోదీ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.