యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరేళ్ల తర్వాత స్వయంభు ప్రధాన ఆలయంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 3వ తేదీ వరకు 11 రోజులు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల కోసం రూ.1.50కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 27న స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 28న తిరు కళ్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలు
23న మత్స్యావతార అలంకారసేవ, వేదపారాయణం, శేషవాహన సేవ జరుగనున్నది. 24న వటపత్రశాయి అలంకార సేవ, హంసవాహనసేవ, 25న శ్రీకృష్ణాలంకరణ సేవ, పొన్న వాహనసేవపై లక్ష్మీనరసింహస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. 26న గోవర్ధనగిరిధారి అలంకారసేవ, రాత్రి సింహ వాహనసేవ, 27న జగన్మోహిని అలంకారసేవ, అశ్వవాహనసేవలు, 28న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై, రాత్రి గజవాహన సేవతో పాటు స్వామి అమ్మవార్ల తిరుకల్యాణం జరుగనున్నది. మార్చి 1న గరుడ వాహనసేవ, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 2న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం, దేవతోద్వాసన, 3న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.