కారులో అసంతృప్తి సెగలు..గెలిచేది ఎలా?

-

అధికార బలంతో పైకి బాగానే ఉన్నా..లోపల మాత్రం బి‌ఆర్‌ఎస్ పార్టీలో చాలా తలనొప్పులు ఉన్నాయి. ఆ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. సీట్ల కోసం కుమ్ములాటలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు గ్రూపులు కడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పడటం లేదు…మంత్రులతో సమన్వయం ఉండటం లేదు. ఇలా ఒకటి ఏంటి బి‌ఆర్‌ఎస్ లో రచ్చ ఓ రేంజ్ లో ఉంది.

అయితే అంతా బాగానే ఉందనే కవరింగ్ బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇస్తుంది. పైగా ఆత్మీయ సమ్మేళనాల్లో పోరు ఏ విధంగా బయటపడుతుందో తెలిసిందే..అయినా సరే సమ్మేళనాలు విజయవంతం అయ్యాయని,  రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ సమావేశాలు పండుగలా జరిగాయని కే‌టి‌ఆర్ అంటున్నారు. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో రచ్చ చాలా జరిగింది. చాలా చోట్ల గొడవలు అయ్యాయి. ఉదాహరణకు చూసుకుంటే నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ప్లీనరీ నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గైర్హాజరయ్యారు. ఈయన సెపరేట్ గా కార్యక్రమం పెట్టుకున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆధ్వర్యంలో ప్లీనరీ నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఆయనకు పోటీగా ర్యాలీ నిర్వహించారు. ఇటు నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పోటీగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇక ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం బి‌ఆర్‌ఎస్ లో సొంతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

కోదాడలో జరిగిన పార్టీ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, ఇతర నేతలు హాజరు కాలేదు. అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాల్లో రెండు చోట్ల చేపట్టిన బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమావేశానికి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సరిత హాజరు కాలేదు. దేవరకొండ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశానికి డిండి జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు గైరాజరయ్యారు. ఇలా బి‌ఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news