టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజని మండిపడ్డారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో చంద్రబాబు ఆయన హయాంలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. మరోవైపు చంద్రబాబుకు గొప్పలు చెప్పడం అలవాటు ఉందని, ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరణ చేయడం సైతం తన ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలను సమాధులో పోల్చిన చంద్రబాబు తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని విడదల రజిని డిమాండ్ చేశారు.
ఈ మేరకు స్థానిక వైసిపి కార్యాలయం నుండి ఎన్‌ఆర్‌టి సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు వైసిపి శ్రేణులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేశాయి. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 31 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎస్సీలు, బీసీలపైనా ఆయ న గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదల్లో జీవితాల్లో గణనీయమైన మార్పులు తెస్తున్నాయని, ఇది ఓర్వలేని బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తున్నారని, ఈసారి కూడా గుణపాఠం తప్పదని హెచ్చరించారు.