జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్‌గా స్పందించారు. పవన్ కళ్యాణ్ రోజురోజుకి దిగజారిపోతున్నాడని, చంద్రబాబు లాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నాడని మంత్రి కొట్టు మండిపడ్డారు. పిచ్చిపట్టినట్లు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబును వదులుకుంటేనే.. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అది చూసి ఓర్వలేకే జగన్‌పై పవన్ విమర్శలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడైన జగన్‌ను విమర్శిస్తే.. ప్రజలే పవన్‌కి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు ఐడియాలజీని అమలు చేసే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని మంత్రి కొట్టు ఆరోపించారు.
రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబేనని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో దేవాలయాలు కూల్చివేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా పవన్? అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని నిలదీశారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని.. వివాహ వ్యవస్థపై గౌరవం లేని పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాడని వ్యాఖ్యానించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని, దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల వివాహాలు జరుగుతాయన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు.