ఎన్నో రోజుల ఉత్కంఠకు, చర్చకు తెరపడింది. ఇంతకాలం టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? లేదా? అనే అంశానికి పవన్ కల్యాణ్ తెరదించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో వైసీపీకి ధీటుగా టిడిపి-జనసేన కార్యాచరణ మొదలుపెట్టనున్నాయి. అయితే చాలాకాలం నుంచి పొత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పవన్ మొదట నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని చెబుతున్నారు..కానీ పొత్తు ఉంటుందో లేదో క్లారిటీ రావడం లేదు.
మొత్తానికి పొత్తు అనేది ఇప్పుడు తేలింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని మూలాఖత్ లో భాగంగా బాలయ్య, పవన్, లోకేష్ కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం బయటకొచ్చిన బాలయ్య, లోకేష్ తో కలిసి పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు అరెస్ట్‌ని ఖండిస్తూనే..ఆయనకు మద్ధతు తెలుపుతూ..జగన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకాలం వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అనే చెప్పానని, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెబుతున్నానని టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని ప్రకటించారు.
అటు బిజేపి తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంటే ఇంకా బిజేపి కలుస్తుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పవన్…బిజేపితో కలిసి ఉన్నారు. కానీ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. ఇప్పుడు బిజేపి కలిసొచ్చినా లేకపోయినా పవన్ మాత్రం టిడిపి కలిసే ముందుకెళ్లనున్నారు. అందులో డౌట్ లేదనే చెప్పాలి.
ఇక నుంచి టిడిపి-జనసేన కలిసి ఉమ్మడి ప్రణాళికలతో పోరాటానికి సిద్ధమవుతాయని, ఎన్నికల తర్వాత సీట్ల గురించి మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలా టిడిపి-జనసేన కలిసిన నేపథ్యంలో వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయి..ఏ విధంగా రాజకీయం చేస్తుందనేది చూడాలి.