ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ అనేక ములపులతో ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. ఇసుకలో అధికార వైసీపీ కూరుకుపోయి పైకి రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదే అదనుగా దెబ్బకొట్టాలని ప్రతిపక్ష టీడీపీ చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో కుంగిపోయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రతిపక్ష టీడీపీని పైకి రానియకుండా పాతాళంలోనే ఉంచడానికి అధికార వైసీపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం గమనార్హం. ఆయన ఎపిసోడ్ ఎటూ తేలకుండా కొనసాగుతుండగానే.. మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, టీడీపీని దెబ్బకొట్టాలని చూస్తున్న వైసీపీకి ఒక అడ్డంకి ఏర్పడుతోంది.
అదేమిటంటే.. తెలుగుదేశం మాదిరిగా తాను పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించబోనని శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే వారికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ నుంచి వచ్చేవారికి ఇదే ప్రధాన అడ్డంకిగా మారిందని వైసీపీ నేతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎమ్మల్యే వల్లభనేని వంశీమోహన ఎపిసోడ్ ఎటూ తేలకుండా కొనసాగుతుండగానే మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు ఉండగా, కోస్తాలోని ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. కోస్తాలోని ఓ ఎమ్మెల్యేను చంద్రబాబు పిలిపించి మాట్లాడడంతో ఆయన మనసు మార్చుకుని.. టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రిపై మాత్రం ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే.. ఆయన ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు.
అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. నాడు అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులపై సీఎం జగన్ చేసిన ప్రకటనతోపాటు సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందేనని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాస్త వెనకాముందు ఆడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు వంశీ, మరో ఇద్దరిని టీడీపీ నుంచి రాజీనామా చేయిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. కానీ, ఇదంతా సులభంగా అయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే గుసగుసలాడుకోవడం గమనార్హం.