ఏపీలో ఘనవిజయం సాధించిన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. మంగళవారం ఫలితాలు వెలువడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ కూర్పు పై చర్చించారు. అయితే ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. సుదీర్ఘ బేటి తర్వాతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం లాంచనమైనప్పటికీ.. కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కావడం.. పలు సందర్భాల్లో తనకు పోలీసు వృత్తి అంటే ఇష్టం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో.. ఆయన హోం మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు హోం మంత్రిత్వ శాఖ అంటే ఇష్టం లేదట. తనకు పర్యావరణ కాలుష్య నివారణ పై పనిచేయాలన్న ఆసక్తి ఉన్నట్లు సమాచారం.