కొత్తరకం వరి వంగడాన్ని పండించిన మహిళ.. ప్రత్యేకత అదే..!

-

ధాన్యంలో వివిధ రకాలు ఉంటాయి. మనకు తెలిసినవి కొన్నే. అయితే లాల్‌ బస్నా ధాన్‌ అనే రకమైన ధాన్యాన్ని ఓ మహిళ సొంతంగా సృష్టించింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఇది మంచి స్మెల్‌ వస్తుందట. వ్యవసాయం మీద ప్రేమతో తాను చేసిన ఈ రూపకల్పన నిజంగా అద్భతమనే చెప్పాలి. ఈ కొత్త వంగడాన్ని ఎలా చేయగలిగింది, దీని వల్ల ఏం ఉపయోగం ఉందో చూద్దామా..!

రైతు కుటుంబంలో పుట్టిన కాదంబినికి చిన్నప్పటి నుంచి వ్యవసాయమన్నా, తోటపని అన్నా చాలా ఇష్టం ఉండేదట. చెప్పలేనంత ఇష్టం. డిగ్రీ తర్వాత పెళ్లైంది. వీళ్లది ఒడిశాలోని రెథువా గ్రామం. భర్తది కూడా రైతు కుటుంబమే. వాళ్లుండే రఘునాథ్‌పుర్‌లో అందరూ వరి పైనే ఆధారపడేవారు.కొన్ని రోజులకు ఇంట్లో ఖాళీగా ఉండటం విసుగెత్తి.. స్థానికంగా రైతులు స్థాపించిన ‘గోరఖ్‌నాథ్‌ కృషక్‌ మహాసంఘా అసోసియేషన్‌’లో సభ్యురాలిగా చేరింది. వారి వద్ద సాగులో నూతన పద్ధతులను తెలుసుకుంది.. సొంతంగా ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టాలనుకుంది.

నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్నార్‌ఆర్‌ఐ), ఒడిశా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ అండ్‌ టెక్నాలజీకి వెళ్లి శాస్త్రవేత్తలను కలిసి.. కొత్త వరి వంగడాల గురించి తెలుసుకునేది. క్రమంగా వరి పంట, కొత్తరకాల విత్తనాల ఉత్పత్తి వంటి వాటిపై అవగాహన పెంచుకుంది. వారి చేయూతతో రెండు రకాల వరి వంగడాలను తక్కువ చోటులో పండించి చూపించింది. అవే కేటాకిజుహ, కుద్రత్‌-3.

ఈ రెండురకాలను ఎన్నార్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల మేరకే కదంబిని పండించింది. ‘రెండు మూడు తరాలుగా ఒకే రకమైనవి పండిస్తున్నారు. ఇలా కాకుండా కొత్త ప్రయోగం చేయాలనిపించింది.. అందులో సువాసన కలిగే వరిని పండిస్తే బాగుంటుందన్న ఆలోచనతో శాస్త్రవేత్తల సలహాతో ఈ ప్రయోగానికి నాంది పలికింది.

అనుకున్నంత సులువు కాదు..

కదంబిని ఆలోచనలు ఒక రూపానికి రావడానికి దాదాపు అయిదేళ్లు పట్టింది. తను పండించిన ఈ కొత్త రకానికి ‘లాల్‌ బాస్నా ధాన్‌’ అని పేరు పెట్టారు. . ఈ ధాన్యాన్ని తను పేరుతో నమోదు చేయించుకోవడానికి దిల్లీ పంపి… అక్కడ వివరాలన్నీ అధ్యయనం చేసి ఈ వరిని ఈ మధ్యే తన పేరుతో రిజిస్టర్‌ చేశారు. దీన్ని పండించడానికి, విక్రయించడానికి తనకు మాత్రమే హక్కు ఉంది.

నీటి అవసరం తక్కువే..

ఈ కొత్తరకం వరి సాగులో రైతు మిగతా పంటల కన్నా ఎక్కువ లబ్ధి పొందవచ్చు.. ముఖ్యంగా దీనికి నీరు పెద్దగా అవసరం ఉండదు. అధిక దిగుబడిని అందుకోవచ్చు. 130 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బియ్యం రుచిగానే కాదు, సువాసనగానూ ఉండటం విశేషం. బియ్యంతో చేసే స్వీట్లు, ఖీర్‌, ముధి వంటి వంటకాలకు ఈ రకం దాన్యం బ్రహ్మాండంగా సరిపోతుందట.

అమ్మ అందరికి అన్నం పెడుతుంది.. మరి పండించటంలోనూ ఏమాత్రం తీసిపోదని కదంబిని నిరూపించింది. ఈ రకం ధాన్యం విస్తృతంగా మార్కెట్‌లోకి రావడానికి టైం పట్టొచ్చు కానీ.. వరి పంటలో అయితే ఇది అద్భుతాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.!

Read more RELATED
Recommended to you

Latest news