మామిడి కోతల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

-

మామిడి కోతల టైం వచ్చేసింది. ఈ టైంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే.. రైతులు నష్టపోవాల్సింది. కాయల ఎగుమతికి నాణ్యత చాలా ముఖ్యం. కోత దశలో జాగ్రత్తలు తీసుకున్నట్లైతే మంచి ధరను పొందేందుకు అవకాశం ఉంటుంది. కాయలను సరైన పద్దతిలో కోయకపోవటం, ముదిరిన కాయలతోపాటుగా, ముదరని కాయలను కోయటం , గ్రేడింగ్ , ప్యాకింగ్ లో సరైన ప్రమాణాలు పాటించకపోవటం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వల్ల పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్దతులు అనుసరించటం ద్వారా ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు.

ఇలా ఉన్నప్పుడే కోయాలి..

తోటల్లో కాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. కాయ ఆకు పచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకు మారి ఉండాలి. శ్వేదగ్రంధులు కనిపిస్తుండాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోతాయి. తొడిమెలతో తెంపిన కాయల్లో నుండి వచ్చే తెల్లటి సొన కారిపోయేంతవరకు కాయలను బోర్లించి ఉంచాలి. కోసిన కాయలను మట్టినేలపై ఉంచకూడదు.

ఇలా అస్సలు చేయకూడదు..

నిషేధించిన పురుగు మందులను కాయల పై పిచికారి చేయకూడదు. వీలైనంత వరకు సేంధ్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తరువాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుండే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు , తిరిగికాయ కోతకు ముందు లీటరు నీటికి 1గ్రాము కార్భండిజం, లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడు సార్లు ఇలా పిచికారి చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి.

కోసిన తర్వాత ఇలా చేయాలి..

కాయలను తొడిమ నుండి సొన పూర్తిగా కారిపోయిన తరువాత కాయల్ని లీటరు నీటికి 1గ్రాము సబ్బు పొడి కలిపిన ద్రావణంలో ముంచి మెత్తటి గుడ్డతో తుడవాలి. లీటరు నీటికి అరగ్రాము బెన్ లేట్ కలిపిన ద్రావణంలో 3 నిమిషాలు ఉంచాలి. తరువాత కాయపై తేమను పొడిగుడ్డతో తుడవాలి. ప్యాకింగ్ చేసే ముందుగా కాయలను సైజుల వారిగా వేరు చేయాలి. కాయల పై మచ్చ, మసి, మంగు, దెబ్బలు, మరకలు ఉంటే వాటిని వేరుచేసి మంచి వాటిని మాత్రమే ప్యాకింగ్ చేయాలి. అన్నీ కలిపి వేస్తే.. మొత్తం కాయలు చెడిపోతాయి. కాయలను పెట్టేల్లో ప్యాగింగ్ చేసే సమయంలో గడ్డిని కాని పేపరును కాని అడుగున వేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news