ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. సరైన సమయానికి ఆహారం తినక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. అయితే రోజువారీ ఆహారంలో బాదం పప్పును చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
అయితే ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే… పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుందని వ్యాయామ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని టిప్స్ పాటించినా.. ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యలను అధిగమించవచ్చని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది. ముఖ్యంగా మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద, వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు.
ఇక బాదం పప్పులో అధికంగా ఉండే ఆల్ఫాటోకోఫెరాల్‌తో మహిళలకు వచ్చే ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్ (విటమిన్-ఇ), అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ముఖాలపై ఉన్న ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేందుకు దోహద పడతాయి. అందుకోసమే రోజువారి డైట్‌లో బాదంను చేర్చుకోవాలని వారు చెబుతున్నారు.
రోజూ బాదం పప్పులు తినడం వల్ల మహిళల ముఖంపై ముడతలు తగ్గడమే కాకుండా.. చర్మ రంగులో కూడా మార్పులొస్తున్నాయని భారతీయ సౌందర్య నిపుణుల పరిశోధనలో నిర్ధారణ అయింది. బాదం పప్పుల్లో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. దీంతోపాటు అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మహిళలు తమ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఈ పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. ప్రతిరోజు పరిగడుపున బాదం పప్పులు తినడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా వేయదని, అధిక బరువు కూడా కంట్రోల్ ఉంటుందని, శరీరానికి తగిన శక్తిని అందిస్తుందన్నారు. అందుకే బాదంపప్పును రోజూ తిని నిత్యం యవ్వనంగా ఉండండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.