మావోయిస్టు పార్టీకి వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆర్కె మరణంతో కీలక నేతను కోల్పోయిన మావోయిస్ట్ లు వరసగా భద్రతా బలగాల చేపడుతున్న ఎన్ కౌంటర్లలో, కూంబింగ్ తో ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. తాజాగా చత్తీస్గడ్ లో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లా అద్వాల్–కుంజేరాల్ అటవీప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
గంటపాటు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. మిలటరీ ఇంటె లిజెన్స్ చీఫ్ ముసికి రాజే, కట్టేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యురాలు మరకం గీత, నుప్పో జ్యోతిగా చత్తీస్ గడ్ పోలీసులు ధ్రువీకరించారు. వీరిలో రాజే, గీతపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు. ఘటనాస్థలంలో ఒక 12 బోర్ తుపాకీ, రెండు మందుపాతరలు, రెండు బర్మార్‌లను స్వాధీనం చేసుకున్నాట్టు వెల్లడించారు. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
మరోవైపు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బతగిలింది. శనివారం రోజు 14 మంది మావోయిస్టులు దంతెవాడ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. వీరంతా పోలీసులపై దాడులు, రోడ్లు ధ్వంసం చేసిన ఘటనల్లో నిందితులుగా పోలీసులు తేల్చారు.