టాలీవుడ్‌లో ఇంగ్లీష్ హవా… ఈ టైటిల్స్ వెరీ స్పెషల్!!

-

సినిమాలను తెరకెక్కించడం ఒక ఎత్తైతే వాటికి టైటిల్స్‌ పెట్టడం మరొక ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైటిల్స్‌.. సినిమాపై ఆసక్తి పెంచడంలో కీలకంగా వ్యవహహరిస్తాయి. అయితే ఒకప్పుడు టాలీవుడ్ చిత్రాలకు అచ్చమైనా తెలుగు పేర్లను మాత్రమే టైటిల్స్‌గా పెట్టేవారు. ఎందుకంటే తెలుగు సినిమాకి అచ్చమైన తెలుగు పేరు పెట్టుకుంటే.. ఆ అందమే వేరుగా ఉంటుంది. పాత రోజుల్లో ప్రతి చిత్రానికీ అలా అచ్చతెలుగు దనాన్ని శీర్షికగా పెట్టేవారు. ఆ పేర్లు ఓ వైపు చిత్రకథా నేపథ్యానికి అద్దం పట్టేలా ఉంటూనే.. మరోవైపు తెలుగు భాషా సొబగుల్ని అద్దుకుని పరిమళించేవి.

కానీ ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి. ఇప్పుడు అంతా యువతరాన్ని ఆకర్షించే క్రమంలో క్రేజీగా, ఆంగ్ల పదాలను టైటిల్స్‌గా పెట్టేయడం ట్రెండ్ అయిపోయింది. పలువురు దర్శక నిర్మాతలు, కథానాయకులు దీనినే ఫాలో అవుతున్నారు. అందులోనూ ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువ అవ్వడం వల్ల అన్ని భాషల ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని టైటిల్స్‌ను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ పేర్లతో రాబోయే సినిమాలేంటి, ఇప్పటివరకు వచ్చిన చిత్రాలేంటి ఓ సారి తెలుసుకుందాం…

లైగర్.. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. మదర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్‌కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యపాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.

గాడ్ ఫాదర్‌.. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్‌ఫాదర్‌. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్‌కి రీమేక్‌గా రూపొందుతోంది. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పకులు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌లో చిరంజీవి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో దర్శనమించారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు స్పష్టం చేశాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం- నీరవ్‌ షా, కళ- సురేష్‌ సెల్వరాజన్‌, సంగీతం- ఎస్‌.ఎస్‌.తమన్‌ అందించారు.

థ్యాంక్‌ యూ.. నవతరానికి ప్రతిబింబంలా కనిపిస్తుంటారు హీరో నాగచైతన్య. మనలో ఒకడిలా కనిపించే ఆయన ప్రేమకథల్లో ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలతో కట్టిపడేస్తుంటారు. జీవితాలకి దగ్గరగా ఉండే కథలతో ప్రయాణం చేస్తున్న నాగచైతన్య ఇటీవల థ్యాంక్‌యూ సినిమాలో నటించారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం జులై 22న ప్రేక్షకులు ముందుకొస్తోంది. రాశిఖన్నా, మాళవిక నాయర్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు.

ఏజెంట్.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ తర్వాత అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్‌. ఇందులో మునపెన్నడి విధంగా సిక్స్ ప్యాక్‌లో స్టైలిష్ ఏజెంట్‌గా అఖిల్ కనిపిస్తున్నారు. సైరా తర్వాత దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమాకి సంగీతం- తమన్‌, కూర్పు- నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం-రాగూల్‌ హెరియన్‌ ధారుమాన్‌ అందించారు.

స్పై.. నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం స్పై. గ్యారీ బీహెచ్‌ తెరకెక్కిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ప్రచార చిత్రంలో నిఖిల్‌ స్పైగా స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ఆయన ఓ ట్రాన్స్‌మీటర్‌ పట్టుకొని మంచు పర్వతాల్లోకి నడుస్తూ వెళ్లడం.. ఆయుధాలున్న రహస్య ప్రదేశాన్ని కనిపెట్టడం.. అందులోని తుపాకులు తీసుకొని శత్రువుల్ని వేటాడేందుకు బయలుదేరడం వంటి సన్నివేశాల్ని ఆ గ్లింప్స్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఇందులో సన్యా ఠాకూర్‌, జిషు సేన్‌ గుప్తా, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు. జూలియన్‌ అమరు ఎస్ట్రాడా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

ది ఘోస్ట్.. నాగార్జున – ప్రవీణ్‌ సత్తారు కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ది ఘోస్ట్‌. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమాని ఇప్పటికే దుబాయ్‌, గోవా, ఊట, హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ఆసక్తి రేకెత్తించే కథతో విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇందులో నాగ్‌, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి యాక్షన్‌- దినేష్‌ సుబ్బరాయన్‌, కేచ్‌, ఛాయాగ్రహణం- ముఖేష్‌ జి అందించారు.

రామారావు ఆన్ డ్యూటీ.. రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రవితేజ శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం- సామ్‌ సి.ఎస్‌., కూర్పు- ప్రవీణ్‌ కేఎల్‌, ఛాయాగ్రహణం- సత్యన్‌ సూర్యన్‌ అందించారు.

ఇటీవలే కొన్ని చిత్రాలు కూడా ఇంగ్లీష్ టైటిల్స్‌తో సందడి చేశాయి. వాటిలో ఆర్ఆర్ఆర్, కేజీయఫ్, ఎఫ్3, ది వారియర్, హ్యాపీ బర్త్ డే, రౌడీ బాయ్స్, ది అమెరికన్ డ్రీమ్, హీరో, గుడ్ లక్ సఖి, సన్ ఆఫ్ ఇండియా, స్టాండ్ అప్ రాహుల్, విర్జిన్ స్టోరీ, ఖిలాడి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version