విశాఖ బంద్ కు ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధం ఏంటని తల పట్టుకోవద్దు. ఇటీవల విడుదలయిన ట్రిపుల్ సినిమా కలెక్షన్ల సునామీకి ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు నిర్వహించనున్న బంద్ కారణంగా రెండు షోలకు మాత్రమే అనుమతి దక్కే అవకాశాలు ఉన్నాయి.దీంతో కలెక్షన్లపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంకా సినిమా విడుదలయి వారం రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే అనుకోని గండం వచ్చి పడిందని చిత్ర నిర్మాణ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు ఉన్నప్పటికీ ఆ జోరు లేదా ఆ హవాకు బ్రేక్ వేసేలా రెండ్రోజుల భారత్ బంద్ ప్రభావం తమ సినిమాపై స్పష్టంగా ఉంటుందని సంబంధిత వర్గాలు కలవరపాటుకు గురి అవుతున్నాయి.దీంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే సినిమా వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తున్న తరుణాన వామ పక్షాల నిర్ణయం ఓ విధంగా ట్రిపుల్ ఆర్ దర్శక నిర్మాతలకు ఆశాభంగమే ! విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక విషయాలు ఇవాళ అపరిష్కృతంగా ఉన్నాయి.
పార్లమెంట్ వేదికగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినా నిరసన చేసినా పట్టించుకునే స్థితిలో లేదు. దీంతో రెండ్రోజుల పాటు పౌర జీవనం స్తంభింపజేసి అయినా తమ గొంతుక వినిపించాలని నిరసన కారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 28న విశాఖ బంద్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ హక్కులకు ఉన్న విలువెంతన్నది చెప్పాలని నిర్ణయించాయి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వర్గాలు. ఇదే సమయంలో వివిధ పార్టీలను సైతం కలుపుకుని పోయేందుకు సిద్ధం అవుతున్నాయి. విశాఖ బంద్ కారణంగా మన్యంలో సైతం అలజడులు రేగేందుకు అవకాశం ఉంది. పాడేరు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. మావో ప్రభావిత ప్రాంతాలు అయిన పాడేరు తో సహా ఇతర గిరిజన గూడలను నిఘా కనుసన్నల్లో ఉంచారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎప్పటి నుంచో వామపక్షాలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఉన్నంతలో తమ గొంతు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా మోడీ సర్కారు నిర్ణయాలు ప్రజాభీష్టం నెరవేర్చేందుకు ఆస్కారం ఇచ్చేలా లేవని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తన్నాయి.
ఈ దశలో ఈ నెల 28,29 తేదీల్లో భారత్ బంద్ కు సన్నాహాలు చేశారు. దేశవ్యాప్తంగా రెండ్రోజుల పాటు బంద్ నిర్వహించేందుకు కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు. ఇవాళ నిర్వహించే సమ్మెకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ శక్తులకు అప్పగించవద్దని కోరుతూ..కమ్యూనిస్టులు విశాఖ బంద్ కు పిలుపునిచ్చారు. అదేవిధంగా బ్యాంక్ ఉద్యోగులు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని, అదేవిధంగా ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ వీళ్లు కూడా రెండ్రోజుల నిరసనల్లో పాల్గొంటున్నారు. దీంతో రెండ్రోజులు బ్యాంకులు కూడా పనిచేయవు. సోమ మరియు మంగళవారాల్లో బ్యాంకులు పనిచేయవు.
– హమారా సఫర్ – మన లోకం ప్రత్యేకం