బ్రిటన్​రాజుకు బాలీవుడ్​ నటి ముద్దు.. ఆమె ఎవరో తెలుసా?

బ్రిటన్‌ను ఏడు దశాబ్దాల పాటు పాలించిన రాణి ఎలిజబెత్‌-2 గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె పెద్ద కుమారుడు ఛార్లెస్‌ బ్రిటన్‌ నూతన రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రిటన్‌ రాచరికం, కాబోయే రాజు ఛార్లెస్‌ గురించి చాలా మందికి తెలిసే ఉన్నప్పటికీ.. ఛార్లెస్‌కు, బాలీవుడ్‌ నటి పద్మిని కొల్హాపుర్‌కు మధ్య జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి చాలా మందికి తెలియదు. గతంలో ఛార్లెస్‌ ముంబయిలో పర్యటించిన సందర్భంగా.. ఆయన చెంపపై పద్మిని ముద్దు పెట్టడం అంతర్జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమైంది.

గతంలో ఛార్లెస్‌ ముంబయిలో పర్యటించారు. అయితే, భారతీయ చలనచిత్రాలు ఎలా రూపుదిద్దుకుంటాయో తెలుసుకునేందుకు ఆయన బాలీవుడ్‌ సినిమా ‘ఆహిస్తా ఆహిస్తా’ (1981) సెట్స్‌కు వెళ్లారు. కొద్దిసేపు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన ఆ సినిమా హీరోయిన్‌ పద్మిని.. ఊహించని రీతిలో ఆయనకు ముద్దు పెట్టారు. దీంతో ఈ ఘటన దేశ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాను ఆకట్టుకుంది. ‘ప్రిన్స్‌ ఛార్లెస్‌ను ముద్దుపెట్టుకున్న మహిళ’ అంటూ వార్తలు వెలువడ్డాయి.

అయితే, చాలా ఏళ్ల తర్వాత 2013లో పద్మిని ఓ సందర్భంగా ఈ ఘటనపై పెదవి విప్పారు. “ఛార్లెస్‌ అప్పట్లో ముంబయిలో పర్యటించారు. అయితే, ఎందుకో తెలియదు రాజ్‌కమల్‌ స్టూడియోలో జరుగుతున్న ‘ఆహిస్తా ఆహిస్తా’ షూటింగ్‌కు వచ్చారు. భారతీయ సంస్కృతిలో భాగంగా శశికళ ఆయనకు హారతి ఇచ్చారు. నేను ఆయన చెంప మీద పెక్‌ ఇచ్చి పలకరించాను. కానీ ఆ రోజుల్లో అది చాలా పెద్ద విషయం. ఆ ఘటన తర్వాత ఓసారి నేను లండన్‌కు విహారయాత్రకు వెళ్తే.. ప్రిన్స్ ఛార్లెస్‌ను ముద్దుపెట్టుకుంది మీరే కదా? అని ఓ బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ అధికారి నన్ను అడిగారు” అని అంటూ నాటి ఘటనను పద్మిని అప్పట్లో గుర్తుచేసుకున్నారు.

https://www.instagram.com/p/CiRMT8KOuAI/?utm_source=ig_embed&ig_rid=f0690de4-3883-404a-97e3-54d487448901