ఆర్ ఆర్ ఆర్ స‌స్పెన్స్ కి తెర ప‌డేది ఎప్పుడో?

ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కి జోడీగా బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్‌ని ఎంపిక చేశారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతూనే ఉంది. బాలీవుడ్ నాయిక‌లు ప‌రిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ల పేర్లు వినిపించాయి. జాక్వెలిన్‌ని ఏకంగా స‌ల్మాన్ ఖాన్ రిక‌మండ్ చేశార‌ని చెబుతున్నారు.

తెలుగులో రూపొందుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌.  రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ యువ‌కులుగా ఉన్న‌ప్పుడు ఏం చేశార‌నే క‌థాంశంతో క‌ల్పిత క‌థ‌తో రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఇది ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. రెండో షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఆ గాయాల కారణంగా దాదాపు ఏడు వారాల పాటు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన చిత్రబృందం ప్రస్తుతం ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

ఈ సన్నివేశాల్లో కొమరం భీమ్ కు బ్రిటిష్ సైనికులకు మధ్య ఫైట్ సీన్ ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. నైట్ ఆ సీన్ కి సంబంధించే షూట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ పోరాట స‌న్నివేశాల్లో భాగం కానున్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కి జోడీగా బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్‌ని ఎంపిక చేశారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతూనే ఉంది. బాలీవుడ్ నాయిక‌లు ప‌రిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ల పేర్లు వినిపించాయి. జాక్వెలిన్‌ని ఏకంగా స‌ల్మాన్ ఖాన్ రిక‌మండ్ చేశార‌ని చెబుతున్నారు. కానీ ఈ ఇద్ద‌రు కాకుండా ఇటీవ‌ల మ‌రో నాయిక సాయిప‌ల్ల‌వి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఫిదా సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌విని కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేసే ఆలోచ‌న‌లో రాజ‌మౌళి బృందం ఉంద‌ట‌. ప్ర‌స్తుతం ఆమెతో చ‌ర్చ‌లు జరుగుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఆమె క‌థానాయిక‌గా క‌నిపిస్తుందా? లేక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుందా అన్న‌ది తెలియాల్సి ఉంది.

మ‌రోవైపు టైటిల్ విష‌యంలో స‌స్పెన్స్ వీడ‌లేదు. ఆర్ ఆర్ ఆర్‌కి పూర్తి పేరు చెప్పండి అని ఆడియెన్స్ ఛాయిస్‌కి వ‌దిలేసిన రాజ‌మౌళి ఓ రెండు మూడు టైటిల్స్ ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. అందులో ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం పేరు బ‌లంగా వినిపిస్తుంది.  ఇక డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 నుంచి రూ.400కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి ప‌లువురు అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నార‌ట‌.ఈ సినిమాని వ‌చ్చే ఏడాది జులై 30న‌ విడుదల చేయ‌డానికి ప్లాన్ జ‌రుగుతుంది. మ‌రి ఈ సినిమాకి సంబంధించి క‌థానాయిక‌, టైటిల్ విష‌యంలో నెల‌కొన్న స‌స్పెన్స్ కి ఎప్పుడు తెర‌దించుతారో చూడాలి.