సినిమాలు తీయాలా, లేదంటే సినిమాలు తీస్తూనే క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండాలా, లేదా రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలా.. అన్న విషయాల్లో స్పష్టత లేక పవన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యాక జనసేన అధినేత పవన్ సైలెంట్‌గా ఉన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. అయితే కొన్ని రోజుల తరువాత ఆయన ఆ మానసిక ఆవేదన నుంచి బయటికి వచ్చి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుండగా, మరోవైపు పవన్ పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆయన ఇప్పుడూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారట.
ఎన్నికల ఫలితాల్లో ఘోరంగా ఓటమి పాలయ్యాక జనసేన అధినేత పవన్ ఎలా ముందుకు సాగాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. సినిమాలు తీయాలా, లేదంటే సినిమాలు తీస్తూనే క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండాలా, లేదా రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలా.. అన్న విషయాల్లో స్పష్టత లేక పవన్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారట. అయితే ఆయనకు ఇప్పుడు మరొక కొత్త చిక్కు వచ్చి పడినట్లు తెలిసింది. అదే 99 టీవీ. ఇప్పుడీ టీవీ చానల్ తనకు వద్దని, జనసేన పార్టీయే దాని నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని, తనను ఆర్థిక సమస్యల నుంచి బయట పడేయాలని ఆ చానల్ యజమాని, జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్ పవన్‌కు మొర పెట్టుకున్నారట.
అప్పట్లో టీడీపీ, బీజేపీలతో తెగదెంపులు చేసుకున్నాక జనసేన అధినేత పవన్ తమ గొంతుకను వినిపించేందుకు తమకు ఓ న్యూస్ చానల్ ఉంటుందని భావించారు. అందుకనే జనసేన నేత తోట చంద్రశేఖర్ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న 99 టీవీ న్యూస్ చానల్‌ను కొన్నారు. అనంతరం జనసేన భావాలను ఆ చానల్ లో బాగానే వినిపించారు. అలాగే ఎన్నికలప్పుడు అందులో పవన్‌కు, జనసేనకు అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. దీంతోపాటు చానల్ ఖర్చులు, జనసేన సోషల్ మీడియా ప్రచార ఖర్చులను కూడా తోట చంద్రశేఖర్ చూసుకున్నారు.
అయితే ఎన్నికల్లో ఎలాగూ గెలుస్తాం కనుక తాను పెట్టిన డబ్బులు మళ్లీ సంపాదించుకోవచ్చని తోట చంద్రశేఖర్ అనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా ఎన్నికల కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టారు కానీ.. జనసేన మాత్రం దారుణంగా ఓటమి పాలైంది. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తోట చంద్రశేఖర్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం లేదు కనుక తోటకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయని సమాచారం. అందుకనే 99టీవీని అమ్మకానికి పెట్టారని తెలిసింది.
అయితే 99టీవీని అమ్మడానికి బదులుగా దాని నిర్వహణ బాధ్యతలను జనసేన పార్టీయే చూసుకోవాలని, తనను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని తోట.. పవన్‌ను కోరారట. అయితే ప్రస్తుతం సినిమాలు లేక, ఎన్నికల్లో ఓడి.. పవన్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆయన చానల్ నిర్వహణ బాధ్యతలను పార్టీకి అప్పగించే యోచన చేస్తారా అన్నది ప్రశ్నార్థకమే అవుతోంది. ఈ క్రమంలో దాదాపుగా 99టీవీ చానల్‌ను ఇతరులకు అమ్మవచ్చనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా.. ఇప్పుడింకో చానల్ అమ్మకానికి సిద్ధంగా ఉంది.. మరి దాన్ని ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి.!