ఎడిట్ నోట్: మరో దిగ్గజానికి వీడ్కోలు..!

-

ఈ ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఊహించని విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీకు మూల స్థంబాలైన సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడం…తెలుగు సినీ పరిశ్రమకు ఊహించని విషాదం మిగిల్చింది.  సెప్టెంబర్ 11న కృష్ణంరాజు మరణించగా, నవంబర్ 15న కృష్ణ మరణించారు. అనారోగ్య కారణాలతో ఈ దిగ్గజాలు దివికేగారు. ఇక ఈ ఏడాది చివరిలో కూడా సినీ ఇండస్ట్రీని మరోసారి విషాదం కమ్ముకుంది.

మరో సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ..నేడు తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‎లో తీవ్రవిషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

అలాగే కైకాల..ఎన్టీఆర్‌కు డూపుగా పలు సినిమాలు కూడా చేశారు. సత్యనారాయణ విలన్ గా చాలా సినిమాల్లో మెప్పించారు. ఇక ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. కైకాల..యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు.

ఇక సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు. ఇక రాజకీయ ప్రస్థానం విషయంకొస్తే…ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తూ వచ్చారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి గెలిచారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇంకా తర్వాత రాజకీయాల్లో కనిపించలేదు.  ఇక కైకాల నట ప్రస్థానంలో అనేక రివార్డులు, అవార్డులు అందుకుని సత్తా చాటారు.

ఇలా సినీ ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన కైకాల చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో కైకాల కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ కాలం చికిత్స పొందారు. మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో కైకాలకు పరామర్శించారు. ఆయన తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటారని ఆకాంక్షించారు. ఈ ఉదయం ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కైకాల తుది శ్వాస విడించారు. ఏదేమైనా ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ మరో దిగ్గజాన్ని కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news