ఎడిట్ నోట్: ‘ఫోకస్’ మునుగోడు..!

-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దాదాపు నెల రోజులు కావొస్తుంది…కానీ ఇంతవరకు మూడు పార్టీలు అక్కడ ఫుల్‌గా ఫోకస్ పెట్టి ప్రచారం మొదలుపెట్టలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…దాన్ని ఆమోదింపజేసుకున్న కోమటిరెడ్డి…గత నెల 21న అమిత్ షా నేతృత్వంలో బీజేపీలో చేరారు. మునుగోడులో భారీ సభ పెట్టి బీజేపీలో చేరారు. పార్టీలో చేరాక ఉపఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

కాకపోతే పూర్తి స్థాయిలో మాత్రం ప్రచారం చేస్తూ రావడం లేదు. ఏదో ఇద్దరు, ముగ్గురు బీజేపీ నేతలతో కలిసి..అప్పుడప్పుడు తిరుగుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు సైతం పూర్తి స్థాయిలో మునుగోడుకు రాలేదు. కోమటిరెడ్డికి మద్ధతుగా తిరగడం లేదు. కానీ తాజాగా వినాయక నిమజ్జనం ముగియడంతో…బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా మునుగోడుకు చేరుకుంటున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ను శుక్రవారం మునుగోడుకు పంపారుఅలాగే చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్‌ కూడా మునుగోడులో ఎంట్రీ ఇచ్చారు. అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ ఆదివారం మునుగోడుకు రానున్నారు. ఇక నిదానంగా బీజేపీ నేతలు మునుగోడుపై ఫోకస్ చేయనున్నారు.

అటు తాజాగా అభ్యర్ధిని ఫిక్స్ చేసుకున్న కాంగ్రెస్…మునుగోడులో దూకుడుగా రాజకీయం చేయడానికి సిద్ధమైంది. పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెకు మద్ధతుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. ఈనెల 18 నుంచి కీలక నేతలంతా మునుగోడు బాటపట్టనున్నారు. అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం..అభ్యర్ధిగా దాదాపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఫిక్స్ చేసినట్లే. ఈ నెల 15వ తేదీ నుంచి మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మునుగోడుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ మేరకు మండలాలు, గ్రామాలవారీగా నేతల జాబితాను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.

ఈ నెల 11 నుంచి వనభోజనాలు ఉండటం, వర్షాలు కూడా విస్తారంగా కురుస్తుండటంతో మునుగోడుకు టీఆర్ఎస్ నేతల రాక ఆలస్యం అయ్యేలా ఉంది. కానీ ఈ నెలలోనే అందరూ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మునుగోడులో ఖచ్చితంగా గెలిచి తీరాలని టీఆర్ఎస్, ఈ సారి కూడా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ…టీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టి మునుగోడులోనైనా సత్తా చాటాలని కాంగ్రెస్‌ చూస్తుంది. మొత్తానికి ఈ నెలలోనే మునుగోడుపై అన్నీ పార్టీలు ఫోకస్ పెట్టనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news