ఎడిట్ నోట్: ఆలు లేదు.. సూలు లేదు..!

-

ఆలు లేదు..సూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అని వెనకటికి ఒక సామెత ఉండేది..అసలు పెళ్లి కాలేదు..కొడుకు పుట్టకుండానే..అప్పుడే కొడుకు పేరు ఏమి పెట్టాలని ఆలోచించినట్లు అని చెప్పొచ్చు. అయితే ఆ సామెత ఇప్పుడు కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి బాగా నప్పుతుందని చెప్పొచ్చు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన దేశ రాజకీయాలని మార్చేయాలని, అలాగే కేంద్రంలోని మోదీ సర్కార్‌ని గద్దె దించేయాలని అంటున్నారు.

అందుకే జాతీయ పార్టీ..బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి..మోదీని గద్దె దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలని కేసీఆర్ ఖరారు చేసేసుకున్నారు..ఇక దసరా రోజు పార్టీని ప్రకటించడమే ఆలస్యం. విజయదశమి రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. పార్టీ గుర్తు కూడా కారే ఉంటుంది. ఆ గుర్తే ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడగనున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు.. పార్టీ పరిధిని తెలంగాణ ప్రాంతం వరకే పేర్కొన్నారు…పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)అని మార్చనున్నారు.

పార్టీ ప్రకటన తర్వాత ఢిల్లీకి వెళ్ళి పార్టీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చూసుకుని, ఈ నెల 9న ఢిల్లీ భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. సరే ఇదంతా కేసీఆర్ నడిపించే ప్రక్రియ. ఇదంతా సజావుగానే సాగిపోతుంది. ఏదేమైనా కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు కానుంది. మరి జాతీయ పార్టీగా ఎంతవరకు రాణిస్తారో చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైంది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మార్చినంత మాత్రాన ఆ పార్టీ పరిధి మారిపోదు. కేవలం తెలంగాణ వరకే ఆదరణ ఉంటుంది.

అయితే నిదానంగా ఇతర రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు. కానీ ఆయన ఇప్పటికిప్పుడే ఇతర రాష్ట్రాల్లో కూడా సత్తా చాటేయాలని చూస్తున్నారు. అందులోనూ ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలని టార్గెట్ చేయనున్నారు. ఏపీ ఎలాగూ తెలుగు రాష్ట్రం అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ రాష్ట్ర విభజన గాయం మనలేదు ఇంకా అలంటప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో సత్తా చాటడం జరిగే పని కాదు. పైగా అక్కడ బలమైన టీడీపీ-వైసీపీలు ఉన్నాయి. ఇక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రాంతాల్లో పోటీ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. పోటీ చేయొచ్చు గాని..గెలుపు మాత్రం దక్కదు.

తెలంగాణ ప్లస్ ఆ మూడు రాష్ట్రాలు కలిపి 100కు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి..వీటిల్లో 50-60 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమాగా ఉన్నారట. అసలు తెలంగాణలో ఉన్న 17కు 17 సీట్లు గెలవడం కష్టమైన పని. వీటిల్లో 8-9 సీట్లు వచ్చేలా ఉన్నాయి. అలాంటిది పక్క రాష్ట్రాల్లో సత్తా చాటుతామని చెప్పడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అసలు పార్టీ ఇంకా పూర్తిగా పెట్టలేదు..ఆ పార్టీకి తెలంగాణలో తప్ప వేరే చోట బలం లేదు..అయినా సరే 50-60 సీట్లు గెలిచేస్తామని కేసీఆర్ ముందే హడావిడి చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news