టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేయించిన సర్వే ప్రకారం.. ఏపీలో టీడీపీకి 17, వైకాపాకు 8 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సాక్షాత్తూ చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో జనసేన నేతల్లో టెన్షన్ మొదలైంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 23వ తేదీనే వెలువడనుండడంతో నేతల్లో టెన్షన్ ఎక్కువైపోయింది. ఫలితాల వెల్లడికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా పందాల జోరు పెంచారు. ఈ క్రమంలోనే ఏపీలో ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతోంది. అయితే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం అటుంచితే.. జనసేన పార్టీకి ఏపీలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి ? ఆ పార్టీ అధినేతతోపాటు ఇతరులు ఎవరు గెలవవచ్చు ? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఒకటైన భీమవరం నుంచి ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన జనసేన నేత, పవన్ అన్న నాగబాబు కూడా ఈసారి ఎంపీగా గెలుస్తాడని సర్వేలు చెప్పాయి. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉండడంతో రెండు విధాలుగా ఆ అంశం కలసి వస్తుందన్ననేపథ్యంలో వ్యూహాత్మకంగానే అటు పవన్ భీమవరం నుంచి, ఇటు నాగబాబు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకే మహిళల ఓట్లు పెద్ద ఎత్తున పడ్డాయని కూడా సర్వేలు చెప్పాయి. అదే విషయాన్ని పోలింగ్ అనంతరం నాగబాబు కూడా చెప్పారు. దీంతో భీమవరంలో పవన్ గెలుపు, నరసాపురం ఎంపీగా నాగబాబు గెలుపు ఖాయమని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ముందు నుంచి జోష్ లో ఉన్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేయించిన సర్వే ప్రకారం.. ఏపీలో టీడీపీకి 17, వైకాపాకు 8 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సాక్షాత్తూ చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో జనసేన నేతల్లో టెన్షన్ మొదలైంది. అసలు ఏపీలో ఉన్నవే 25 ఎంపీ స్థానాలు అయితే వాటిలో 17, 8 చొప్పున ఎంపీ స్థానాలను టీడీపీ, వైకాపాలు పంచుకుంటే ఇక మిగిలే స్థానలు సున్నా. మరలాంటప్పుడు జనసేనకు ఎంపీ సీట్లు రావు కదా. మరిక అప్పుడు నాగబాబు ఎంపీగా ఎలా గెలుస్తారు ? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ అంచనాలు మాత్రమే కనుక, పెద్దగా దిగులు చెందాల్సిన పనిలేదని, తామే గెలుస్తామని జనసేన చెబుతోంది. మరి వారు చెప్పినట్లు నిజంగానే పవన్ భీమవరంలో, నాగబాబు నరసాపురంలో గెలుస్తారా, లేదా అన్నది మరి కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది..!