కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ అయితే సరిపోతారని ఆ పార్టీ వర్గాలు ప్రస్తుతం భావిస్తున్నాయట. అందుకనే ఆమెను పార్టీ అధ్యక్షురాలిని చేయాలనే డిమాండ్ జోరుగా వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఈ క్రమంలోనే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొద్ది రోజుల కిందట తన పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మాత్రం ఇంకా రాహుల్ రాజీనామాను ఆమోదించలేదు. కానీ రాహుల్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ పార్టీ కొత్త అధ్యక్షుడి వేటలో పడింది. అయితే ఇప్పటికే ఆ పదవి కోసం పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు సోనియా గాంధీ దృష్టికి వచ్చాయని తెలుస్తుండగా.. ఇప్పుడు తెరపైకి మరొక కొత్త పేరు వచ్చింది. ఆమే.. రాహుల్ సోదరి.. ప్రియాంకా గాంధీ..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ అయితే సరిపోతారని ఆ పార్టీ వర్గాలు ప్రస్తుతం భావిస్తున్నాయట. అందుకనే ఆమెను పార్టీ అధ్యక్షురాలిని చేయాలనే డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లోనూ ఈ విషయంపై జోరుగా ప్రచారం సాగుతోంది. రాహుల్ రాజీనామాను ఆమోదించి ఆయన స్థానంలో ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయంపై సీడబ్ల్యూసీదే తుది నిర్ణయం కనుక.. ఇప్పుడు బంతి ఆ కోర్టులో ఉందని తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ ఆమోదిస్తే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛన ప్రాయమేనని తెలుస్తోంది. అయితే మరోవైపు రాహుల్ గాంధీ మాట మార్చుకుని తిరిగి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని కూడా మరొక వర్గం ప్రచారం చేస్తోంది. అసలే ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉండగా.. ఇప్పుడీ అధ్యక్ష పదవిని ఎవరు చేపడుతారా..? అనే విషయం పార్టీ పెదలకు మరొక తలనొప్పిగా మారింది. ఓ వైపు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టడం, మరొక వైపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనే అంశాలతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎన్నుకోవడం వారికి సవాల్‌గా మారింది. మరి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక బాధ్యతలు స్వీకరిస్తారా..? లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా..? అన్నది తెలియాలంటే.. మరికొద్ది రోజుల వరకు వేచి చూడక తప్పదు..!