‘సైరా..’ చరణ్‌కు అగ్నిపరీక్షే.!

సైరా నరసింహారెడ్డి –  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో ఆయన తనయుడు రామ్‌చరణ్‌ తలపెట్టిన చిత్రం. సినిమా మొదలైననాటినుండి అన్నీ అవాంతరాలే. 16నెలల నుండీ ఇంకా షూటింగ్‌లోనే ఉంది. అత్యంత భారీతారాగణంతో, 200కోట్ల ఖర్చుతో తీస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు.

అది 6 డి

సెంబర్‌ 2017. మెగాస్టార్‌ చిరంజీవితో వరుసగా రెండోసారి సినిమా తీయబోతున్న నిర్మాత రామ్‌చరణ్‌. చరిత్ర మరిచిపోయిన స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తలపెట్టిన ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ చిత్రసీమ నుంచి అతిరథమహారథ నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్న మహాయజ్ఞం. అట్టహాసంగా ప్రారంభమైంది.

నేడు 11 ఏప్రిల్‌ 2019. ఆ సినిమా పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియడంలేదు. ఆఖరుకు నిర్మాత రామ్‌చరణ్‌కు కూడా. చరిత్ర మరిచిపోయిన వీరుడి సినిమాను జనం కూడా మరిచిపోతున్నారు.

ఓసారి సెట్టింగులకు అనుమతి లేక ప్రభుత్వం వారు కూల్చేసారు. ఆలస్యం. ఇంకోసారి షూటింగ్‌లో అగ్నిప్రమాదం. మళ్లీ ఆలస్యం. ఉత్తరభారతంలో షూటింగ్‌ తలపెడితే, అక్కడా అనుమతుల్లేక వెనుకకు పయనం. మళ్లీ ఆలస్యం. సంగీతం మారిపోయింది. పోయిన దసరా విడుదల… పోయింది. ఈ సంక్రాంతి విడుదల.. పోయింది. ఎండాకాలం విడుదల.. పోతోంది. ఈ దసరా విడుదల.. ఇంకా పోలేదు.. కానీ తెలియదు.

వందల కోట్ల బడ్జెట్‌, పెద్ద దర్శకుడు, పేద్ద హీరో, భారీ తారాగణం… ఇవి కాదు కావాల్సింది ఒక మంచి సినిమా తీయాలంటే. క్రమశిక్షణ. క్రమశిక్షణే అన్నింటికంటే ముఖ్యం. ఒక స్వాతంత్య్ర పోరాటయోధుడి జీవిత చరిత్ర అంటే బాగా పరిమితులుండే కథ. ఏ మాత్రం చిత్రానుకరణ స్వేచ్ఛ ఉండదు. కొంతేదో తెలియన వ్యక్తిగత విషయాల పట్ల మెలోడ్రామా సృష్టించవచ్చేమోగానీ, ఇతరత్రా ఎటువంటి విపరీత దృశ్యాలు తీయలేరు. ఆయన జీవితం తెలిసినవారు కొంతమంది ఉంటారు. ఉన్నారు కూడా. అంత పరిశోధన చేసి, బౌండ్‌ స్క్రిప్ట్‌తో క్షేత్రంలోకి అడుగుపెట్టినవారికి ప్రస్తుతం అయోమయం జగన్నాధంలా ఉంది పరిస్థితి. దర్శకుడు పూర్తిగా కన్ఫ్యూజన్‌లోకి వెళ్లిపోయాడు. ఏది, ఎప్పుడు తీయాలో తెలియనంత అయోమయం. పైగా అందరూ బిజీగా ఉండే పెద్ద తారలు. డేట్స్‌ సమస్య ఒకటి. స్క్రిప్ట్‌ మీద చాలామంది చేతులు పడ్డాయని ఇండస్ట్రీలో గుసగుసలు. ఒక్కడుగు ముందుకేస్తే, నాలుగడుగులు వెనక్కివేస్తున్నట్లు ఉంది. హీరో, ప్రొడ్యూసర్‌ కూడా వేళ్లు పెడితే పరిస్థితి పాతాళంలో ఉంటుంది. చరిత్రను హృద్యంగా చిత్రీకరించకపోతే ఫలితం ‘శాతకర్ణి’లా ఉంటుంది.

ఒకపక్క హిందీలోనూ, తమిళంలోనూ పెద్దహీరోలతో సహా రియలిస్టిక్‌ కథలతో సినిమాలు తీసి విజయవంతమవుతున్నారు. మన దగ్గర మాత్రం ఇంకా ‘అభిమానులు’ అనే చట్రంలో గింగిరాలు తిరుగుతున్నారు. అణాకు, కానీకి పనికిరాని చెత్త బ్యాచ్‌ను చూసి అభిమానులనుకుంటే కష్టం. ఈ సినిమా నిర్మాత రామ్‌చరణ్‌ కూడా ‘రంగస్థలం’ అనే అద్భుతమైన సినిమాలో అనుపమానంగా నటించి, మెప్పించి, తర్వాత ఫార్ములా ప్రకారం ‘వినయ…’తో బొప్పి కట్టించాడు. మూసలోంచి బయటికి రాకపోతే, ఎంత పెద్ద హీరోనైనా వారంలో వెనక్కి పంపించేస్తున్నారు. రావడం రావడమే విభిన్నంగా వచ్చిన తాజా సంచలనం విజయ్‌ దేవరకొండ. ఎటువంటి శషభిషలు లేకుండా కథ డిమాండ్‌ చేస్తే ఎలా నటించడానికైనా సిద్ధపడే ఈ హీరో ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారిపోయాడు. దేనికదే భిన్నంగా ఉండే కథలనెంచుకుంటున్నాడు. రామ్‌చరణ్‌ కూడా నిజానికి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడనే పేరుంది. దానికి నిదర్శనం కూడా ‘రంగస్థలం’, రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. చిరంజీవి చిరకాల వాంఛ అయిన ఉయ్యాలవాడ సినిమాను తీయాలనే కోరిక తప్పు కాదు. కానీ సరైన పద్ధతిలో, ఎంతో క్రమశిక్షణతో తీయలేకపోతే, ఎవరికైనా ఎంత నష్టం? ‘ఖైదీ నెం.150’ వచ్చి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. చిరంజీవి ఇంకా రెండు సినిమాలు ఒప్పుకుని ఉన్నాడు. దీనివల్ల అవి కూడా ప్రమాదంలో పడతాయి.

బాహుబలిని బీట్‌ చేయాలనుకోవడం తప్పుకాదు. కానీ అది బడ్జెట్‌తో కాదు. కథతో చేయాలి. రాజమౌళికి బాహుబలి విషయంలో ఎంతో స్వేచ్ఛ ఉంది. అది పూర్తిగా ఊహాజనిత, కాల్పనిక గాథ. దర్శకుడు ఎలాగైనా ఆడుకోవచ్చు. ఇక్కడ  ఆ పరిస్థితి లేదు. ఇది నిజంగా జరిగిన కథ. ఎంతో కేర్‌ఫుల్‌గా డీల్‌ చేయాలి. పదిమంది ఇరవై చేతులేస్తే, పులగం కాస్తా కంగాళం అవుతుంది.

ఇప్పటికే బయ్యర్లు కాస్తా వెనుకాముందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆలస్యమయితే ఇక ప్రైమ్‌, యూట్యూబ్‌లే గతి. ఏ పోలికలు, పోటీలు పెట్టుకోకుండా సినిమాను సినిమాలాగా తీస్తే ఉత్తమం. డబ్బుల సంగతి ఎలా ఉన్నా, కనీసం పేరైనా వస్తుంది.

 

  • రుద్రప్రతాప్‌