ఎడిట్ నోట్: సర్వేల సందడి..!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది..ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో రాజకీయం ఎన్నికలు టార్గెట్ గానే జరుగుతుంది. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ నడుస్తుంటే..ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. అయితే ఏపీ కంటే ముందే తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమైతే..2023 డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. కానీ కేసీఆర్ మళ్ళీ ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు మునుగోడు ఉపఎన్నికలో బిజీగా ఉన్నాయి.

అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది..ప్రజలు ఎవరు వైపు ఎక్కువ ఉన్నారనే అంశాలపై సర్వేలు నడుస్తున్నాయి..పార్టీలకు చెందిన సొంత సంస్థలు…అలాగే ఇతర సంస్థలు కూడా తెలంగాణలో దిగి సర్వేలు చేస్తున్నాయి.

ఇదే క్రమంలో ఆ మధ్య మస్తాన్, ఆత్మసాక్షి సర్వేలు వచ్చాయి. ఈ సర్వేల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకే ఎడ్జ్ ఉందని తెలిసింది. అయితే మస్తాన్ సర్వేలో టీఆర్ఎస్  పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో ఉందని, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని చెప్పింది. ఆత్మసాక్షి సర్వే విషయానికొస్తే టీఆర్ఎస్ మొదటి స్థానం, కాంగ్రెస్ రెండు, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని తేలింది. జాతీయ సర్వేలు చూసుకుంటే టీఆర్ఎస్ ముందున్న సరే బీజేపీ కాస్త దగ్గరలో ఉందని చెప్పాయి. కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం ఇచ్చాయి.

అవి తెలంగాణకు సంబంధించిన సర్వేలు…ఇక ఏపీకి సంబంధించి కూడా అనేక సర్వేలు నడుస్తున్నాయి. ఇప్పటికే పీకే టీం…వైసీపీ కోసం సర్వేలు చేస్తుంది. అటు టీడీపీ కూడా సొంత సర్వేలు చేసుకుంటుంది. అలాగే ఇతర సంస్థలు కూడా సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఈ మధ్య పీకే సర్వే అంటూ వచ్చిన సర్వేలో వైసీపీకి లీడ్ ఉంది. అలాగే జాతీయ సర్వేల్లో వైసీపీకే లీడ్ ఉంది..మళ్ళీ ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పాయి.

తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఏపీకి సంబంధించి అధికారికంగా ఓ సర్వేని విడుదల చేసింది..ఈ సర్వే ప్రకారం ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ 95 సీట్లు, వైసీపీ 75 సీట్లు, జనసేన 5 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఇక టీడీపీకి 44.5 శాతం ఓట్లు, వైసీపీకి 43 శాతం, జనసేనకు 9 శాతం, ఇతర పార్టీలకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ 1.5 శాతం ఉందని చెప్పింది. అయితే ఈ సర్వే టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలని ఇచ్చింది. ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఫలితాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలా అని ఇప్పుడు వచ్చే సర్వేలని నమ్మడానికి లేదు. అటు తెలంగాణలోనైనా, ఇటు ఏపీ లోనైనా ప్రజల నాడి అప్పుడే దొరకడం కష్టం. కాకపోతే కాస్త దగ్గరగా సర్వేలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చే సర్వేలు కంటే ఎన్నికల ముందు వచ్చే సర్వేలు కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్ని సర్వేలు వచ్చిన…అవన్నీ ఇప్పుడున్న పరిస్తితులని బట్టి వచ్చేవి. ఎన్నికల సమయానికి పరిస్తితులు మారిపోవచ్చు. అయితే ఎన్నికల హడావిడి మొదలైంది కాబట్టి సర్వేల సందడి కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news