ప్ర‌ధాని మోదీని ప్ర‌తి దానికీ పిల‌వాల్సిన ప‌నిలేదు.. కాళేశ్వ‌రానికి చిల్లి గ‌వ్వ ఇవ్వ‌లేదు: కేసీఆర్

-

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించ‌క‌పోవ‌డానికి కార‌ణం.. కేంద్రానికి, కేసీఆర్‌కు మ‌ధ్య పెరిగిన గ్యాపేన‌ని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్న విష‌యం విదిత‌మే. సీఎం కేసీఆర్ త‌నన క‌ల‌ల ప్రాజెక్టుగా చెప్పుకు వ‌స్తున్న కాళేశ్వ‌రంతో ఎన్నో ల‌క్ష‌ల ఎక‌రాలు సాగునీటిని అందివ్వ‌నున్నారు. దీంతో ఉత్త‌ర తెలంగాణ స‌స్య శ్యామ‌లం అవుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రులైన దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, జ‌గ‌న్‌ల‌ను కేసీఆర్ ఇప్ప‌టికే ఆహ్వానించారు కూడా. అయితే అంత‌టి ప్ర‌తిష్టాత్మ‌కమైన ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు ఆహ్వానించ‌లేద‌నే విష‌యంపై ఇప్పుడు అన్ని వ‌ర్గాల్లోనూ జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించ‌క‌పోవ‌డానికి కార‌ణం.. కేంద్రానికి, కేసీఆర్‌కు మ‌ధ్య పెరిగిన గ్యాపేన‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు దేశంలో హంగ్ వ‌స్తుంద‌ని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ముఖ్య భూమిక పోషిస్తుంద‌ని, దాంతో ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని కేసీఆర్ భావించారు. అయితే ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు మాత్రం షాకిచ్చాయి. బీజేపీకి 353 స్థానాలు వ‌చ్చాయి. గ‌తంలో క‌న్నా ఆ పార్టీకి ప‌లు స్థానాలు పెరిగాయి. దీంతో మ‌ళ్లీ మోదీయే ప్ర‌ధాని అయ్యారు.

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ బీజేపీ ఏకంగా 4 పార్ల‌మెంట్ స్థానాల‌ను కైవ‌సం చేసుకుని బ‌లం పుంజుకుంది. దీంతో బీజేపీ పెద్ద‌లు తెలంగాణ‌పై దృష్టి సారించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం బీజేపీయే అని చెబుతూ పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు బ‌లోపేతం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే బీజేపీ నేత రాం మాధ‌వ్‌ను రంగంలోకి దించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచే కాక తెరాస‌లో అసంతృఫ్తిగా ఉన్న నేత‌ల‌ను బీజేపీలో చేరే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ముందు జాగ్ర‌త్త‌తో ఉండే కేసీఆర్‌.. తెలంగాణ‌లో పాతుకుపోదామ‌ని బీజేపీ చేస్తున్న య‌త్నాల ప‌ట్ల గుర్రుగా ఉన్నార‌ని స‌మాచారం.

అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల‌ని ఎన్ని సార్లు అడిగినా కేంద్రం ఇవ్వ‌లేద‌ని, ప్రాజెక్టుకు కేంద్రం చిల్లి గ‌వ్వ కూడా ఇవ్వ‌లేద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ప్రాజెక్టు మొత్తం ఖ‌ర్చును భ‌రించింద‌ని.. కేసీఆర్ నిన్న‌టి ప్రెస్ మీట్ లో అన్నారు. మ‌ర‌లాంటప్పుడు మోదీ చేత కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ప్రారంభోత్స‌వం చేయించ‌డం స‌రికాద‌ని.. అందుక‌నే మోదీని ఈ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ ఆహ్వానించ‌లేద‌ని తెలిసింది. ఇక కేసీఆర్ నిన్న‌టి మీటింగ్‌లో మాట్లాడుతూ.. ప్ర‌తి కార్య‌క్ర‌మానికి మోదీని పిల‌వాలా..? మిష‌న్ భ‌గీర‌థ కార్యక్ర‌మానికి ఆయ‌న్ను పిలిచాం క‌దా.. అని కూడా విలేక‌రుల‌తో అన్నారు. అలాగే బీజేపీలో చేరుతున్న నేత‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ‌కు క‌మ‌లం పార్టీ చేసిందేమీ లేద‌ని తేల్చారు. దీన్ని బ‌ట్టి మ‌న‌కు తెలుస్తుందేమిటంటే.. ముందు ముందు కేసీఆర్ కేంద్రంతో ఎలా వ్య‌వ‌హ‌రించనున్నారో మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. మ‌రి బీజేపీ ఇందుకు ఏమ‌ని స‌మాధానం చెబుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news