మనుషుల్లో కాస్తయినా సాయం చేసే గుణం లేదని బాధపడడం కొన్ని సందర్భాల్లో కొందరికే సాధ్యం. అలాకాకుండా రాజకీయం ఎలా ఉన్నా పరిణామాలు అర్థం చేసుకుని ఇతరులకు సాయం చేయడం ఓ మంచి పద్ధతి.ఈ పద్ధతి ప్రకారం పనిచేస్తే ముందుగా నాయకులు ఏమయినా మార్పు చెందారా లేదా పరిణామాలే వారిని ఆ విధంగా నడిపిస్తున్నాయా అన్నవి అర్థం చేసుకోవచ్చు.
పల్నాటి సీమలో వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన బీసీ నేత జల్లయ్య కుటుంబాన్ని టీడీపీ యువ నేత నారా లోకేశ్ ఆదుకున్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి వచ్చారు. అంతేకాదు బాధిత కుటుంబంలో విషాద ఛాయలు తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. జల్లయ్య ముగ్గురి బిడ్డలనూ చదివించే బాధ్యత తనదేనని చెప్పారు. రాజకీయం ఎలా ఉన్నా లోకేశ్ తనదైన మానవతను చాటుకున్నారు. ఆ విధంగా బాధిత హృదయాలకు అండగా నిలిచి, రేపటి వేళ ఆ కుటుంబానికి ఓ అన్నయ్య మాదిరి ఉంటానని చెప్పి వచ్చారు.
మరో ఘటనలో నిన్నటి వేళ (జూన్ 23, 2022) సీఎం జగన్మోహన్ రెడ్డి మానవతను చాటారు. బాలాజీ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను కలుసుకునేందుకు ఓ బాధిత కుటుంబం నడిరోడ్డుపైనే నిరిక్షిస్తూ ఉంది. అది గమనించిన సీఎం స్పందించి తన భద్రతా సిబ్బందిని పంపి వారి వినతి అందుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన మహేశ్ తనకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ రోడ్డు పక్కన నిల్చొని అవస్థపడుతున్నారు. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి చేయి విరిగిపోయింది. కాలు కూడా పనిచేయడం మానేసింది. ఆపరేషన్ కోసం ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఏడు లక్షల రూపాయలు అయింది. సీఎం ఆఫీసును సంప్రదించాలన్నా లేదా ఇతర దారుల్లో ప్రభుత్వ సాయం తీసుకోవాలన్నా అతడు అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నాడు.కానీ ఆయన్ను ఆదుకున్నవారే లేకపోయారు. దీంతో ఆయన దీనావస్థను ముఖ్యమంత్రికి చెప్పాలని ప్రయత్నించారు. ఏదేమయినా ఆయనకు సీఎం సాయం చేస్తే చాలు.. ఇవి కూడా చేయని పాలకులు ఉన్నారు. కనుక సీఎం జగన్ కొంత బెటర్.సీఎం వర్గాలు మరికొంత చొరవ తీసుకుంటే బాధిత కుటుంబం బతికినంత కాలం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకుని జీవించడం ఖాయం.