స్నేహ పూర్వకంగా పొందే కలహం కన్నా
విరుద్ధ ఆవేశాల మధ్య వెలిగే విరహమే గొప్పది
మళ్లీ రాయకూడని ఓ పరిభాషకు సంకేతంగా ఉండాలని కోరిక. మిగిలిన మనుషులు,మిగిలిన మెతుకులు నాకెందుకని గొప్పగా తోస్తున్నాయో..! ఆ..భూమిజను వేడెదను..ఆ..అడవి బాట పట్టెదను..ఔను!విస్ఫోటనకారి
వెలిగే జ్యోతి కొన్ని అక్షరాల విన్నపాలను మోసుకువస్తే..కొడిగట్టిన దీపాలు కొన్ని శాపాలను ప్రతిఫలం గా అందిస్తాయి. కనుక వెలుగు వరం కాదు శాపం..వరం లాంటి శాపాన్ని మోయడమే జీవితం. అందుకే అంటున్నాగా వెలుగు చెంత వెలుగు జత
ఓ విషాదం..చీకటి చెంత వెలుగు చేరిక ఓ వికాసం..అని! అర్థం చేసుకోరూ..! విషాదాలు కొన్ని ప్రథమాదిలో పుట్టి చస్తాయి.. వికాసాలు అన్నీ జీవిత చివరికొస దాకా తోడుంటాయి. పుట్టి చచ్చే విషాదాన్ని ప్రేమించాలి.చచ్చిబతికే జీవితాలను తప్పక
ప్రేమించాలి..జీవితాల నుంచి ఇంతకుమించి గొప్పగా ఏమీ కోరుకోరాదు.కొన్నిసార్లు కుదరకుంటే ప్రతి ఎంపికా చెడ్డదే, ప్రతి కూడిక కూడా చెడ్డదే..ఏది మంచి అన్నది ఎలా నిర్థారణ…నాకు తెలిసి త్వరగా నిర్థారణకు నోచుకునే చెడు..త్వరగా గుర్తింపునకు నోచుకోని మంచి కన్నా కాస్త మంచి అంతే!
మంచి, చెడుల ప్రావస్థల్లో ప్రేమ గుడ్డిది..వెలుగును బలి కోరి చీకటిని బహుమానం ఇస్తుంది కనుక ప్రేమ గుడ్డిది. అత్యంత జ్ఞానవంతంగా తోచేది శృంగారం మాత్రమే! దేహానికి కోరికలను బదులుగా ఇవ్వడం ఎంతో వివేకంతో కూడిన చర్య. ఈ కోరికలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతగా మనం అంధత్వంలో బతకవచ్చు..కొన్నిసార్లు ఏమీ గుర్తించలేని నైజం గొప్పది.
గుర్తింపునకు నోచుకోని విశ్వాసాలు కన్నా గుడ్డి నమ్మకాలే కొందరికి మేలు చేస్తాయి. నమ్మకం కీడును ఎంచుతుందో లేదో తెలియదు. కానీ విశ్వాసం కీడెంచి మేలు మిగులుస్తుంది. గుండె ఆత్మకు విశ్వాసాన్ని..చూపులకు నమ్మకాన్ని ఇవ్వండి.. తప్పక చూసేదంతా నమ్మి..నిజానిజాల నిర్థారణలో ఓడిపోండి.
దేహగతమైన వ్యాపకాల్లో చూపుల కన్నా మించి మరొకటి ఉంటుంది అదే స్పర్శ. పెదవుల తాయిలంలో నమ్మకాలతో పనేముంది??…అధర తాంబూలం పండితే శృంగారం ఫలించినట్లేనా??? ఆమె గారి దేహ పూజకు గుప్పెడు పూలు నలప వద్దు ప్లీజ్..పరిమళించిన చీకటి గొప్పది గుడ్డిగా నడిపే వెలుగు చెడ్డది..
పాదాల కింద కొన్ని విశ్వాసాలను నలిపేయండి…రేగే ధూళి ఓ రస విస్రుమర..మీకో/నాకో/ఎవడికో ఈ ఏకాంత కాంతి తప్పక పరిచయం అవుతుంది..మనం అనాల్సిన నాలుగు మాటలూ మనవి కావు..మనం చెప్పాల్సిన ఆ నాలుగు నీతి కథలూ మనవి కావు..అడవి నుంచి వచ్చినవి అడవికే పోవాలి.. తాంత్రిక వాదిగా మాట్లాడకు. ఉన్మాదపు జాడలు అంతటా ఉన్నాయి కదా! మళ్లీ మానవత్వం వికసించిందని అంటారేంటి ..తప్పు.. వ్యాపార వస్తువు గా మానవత్వం ఉన్నప్పుడు అది వినిమయ సంస్కృతికో ప్రహేళిక..ఆ..కాల నాళికకు, ఆ..కంకేళికా ఝరులకు తప్పక ఓ మొక్కు మొక్కాలి. చావును తప్పక ఆహ్వానిస్తే ఆమె దేహం నుంచి విముక్తి.ఈ రోజు చదివాను మనసులో లేనిది మాటగా బయటకు రా వడాన్ని”ఫ్రాయిడన్ స్లిప్”అంటారు అని.. నా స్నేహితుడు ఒకడు ప్రస్తావించాడీ మాట. భలే! కానీ మన దగ్గర నెత్తి మీద ఉన్న కొన్ని స్వరాలు మనతో అనకూడని మాటలు అనిపిస్తాయి..అప్పుడే అప్రమత్తత అవసరం.
ఏది అథమం..ఏది ఉత్తమం అన్న స్పష్టత వచ్చేలా తోచనీయని సందర్భం ఒకటి నిన్నూ నన్నూ శాసిస్తుంది. అప్పుడు మాత్రమే మనిషి మిన్నూ,మన్నూ కానడని అమ్మ చెప్పింది. ద మోస్ట్ వరస్ట్ పెర్సప్షన్ ఈజ్ సాక్రిఫైజింగ్.. మనం ఏమి ఇవ్వాలి..ఎందుకని ఇవ్వాలి ఇవి తెలుసుకోకుండానే అసందర్భంగా మౌనాన్ని ఇస్తున్నాం..మాటను ఇస్తున్నాం..పాటింపునకు నోచుకోని వాక్కుని దానం ఇచ్చి తెగ సంబరపడిపోతు న్నాం. ఇచ్చేది సార్థకతకు నోచుకోదు. పుచ్చుకునేది పది కాలాల పాటూ నిలవదు. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ కానగరాదు. పెరిగి,విరిగే శబ్దం అందంగా తోచిన నిశ్శబ్దం. ఆ..వికృతి/ఈ..ప్రకృతి రెండూ ఒక్కటే. కొన్ని సార్లు. ఎప్పుడూ చెప్పిన విధంగానే దేహాలకు జీవితేచ్ఛను బలిగా ఇవ్వాలి. అదిగో సరికొత్త కాలం మనకోసం నిరీక్షిస్తుంది. కొత్త విఘడియ చెంత ఓడిపోదాం రండి!
– రత్నకిశోర్ శంభుమహంతి