తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. మే ఒకటో తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇక రాష్ట్రంలో కర్ఫ్యూ నేపథ్యంలో దానికి అనుగుణంగా హైదరాబాద్ మెట్రో, సిటీ ఆర్టీసీ బస్సుల సర్వీసు వేళల్లో మార్పులు జరిగాయి.
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పు చేస్తున్నట్లు హెచ్‌ఎంఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రతి టెర్మినల్ మెట్రో స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని.. ఆయా రైళ్ళు రాత్రి 8.45 గంటల్లోపు గమ్య స్థానాలకు చేరుకుంటాయని తెలిపింది. ఇక ఉదయం ఎప్పటిలాగే 6.30 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభమవుతాయని పేర్కొంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ మెట్రో కోరింది.
ఇక సిటీ బస్సుల సమయాల్లో కూడా ఆర్టీసీ మార్పులు చేసింది. రాత్రి 9 గంటల లోపు బస్సులు ఆయా డిపోలకు చేరుకుంటాయని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి వెల్లడించారు. జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు 9 గంటలలోపు వెళ్తాయని అన్నారు. అలానే రాత్రి 9 గంటల తర్వాత బయలుదేరాల్సిన బస్సులు 9లోపే వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్కు తప్పనిసరిగా ఉంటేనే అనుమతిస్తామని అన్నారు.