గర్భం దాల్చగానే.. చాలా మంది ఇళ్లలో తెగ హైరానా పడిపోతారు.. ఇక ఆ మహిళకు పెట్టే ఆహారాలు అయితే లెక్కే ఉండదు.. ఏదో ఒకటి తీసుకొచ్చి తినమంటారు. దీనివల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా, అందంగా ఉంటాడు అంటారు.. మీ అందరికీ తెలుసు.. గర్భిణీలు కుంకుమపువ్వు వాడటం వల్ల పుట్టబోయే పిల్లలు తెల్లగా, హెల్తీగా ఉంటారని.. ఇందులో నిజమెంత ఉందని సంగతి పక్కనపెడితే.. నేటికీ ఇది వాడేవాళ్లు ఉన్నారు. అసలు గర్భిణులు ఎన్నో నెల నుంచి కుంకుమపువ్వు వాడాలి..? ఏంటి మొదటి నుంచి వాడకూడదా అని డౌట్ వస్తుందా..? అవును మరీ.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే వాడేయకూడదు.. దానికి ఒక లెక్క ఉంటుంది. మరి ఆ లెక్కలేంటో చూద్దామా..!
కుంకుమ పువ్వును పాలలో కలిపి గర్భిణీలు తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. దీంతో బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. పుట్టుకతో లోపాలు రాకుండా ఉంటాయి. అందువల్ల డాక్టర్లు సైతం ఈ విధంగా తాగమని సిఫారసు చేస్తుంటారు.
అయితే కుంకుమ పువ్వును గర్భిణీలు ఎన్నో నెల నుంచి పాలలో కలిపి తాగాలో చాలా మందికి తెలియదు. కానీ ఆయుర్వేద ప్రకారం.. 4 నెలలు పూర్తయ్యాకే 5వ నెల వచ్చాక మాత్రమే పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగాలి. ఐదో నెలలో బిడ్డ కదలికలు తల్లికి బాగా తెలుస్తుంటాయి. ఆ సమయంలో కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగాల్సి ఉంటుంది.
కుంకుమ పువ్వు దారం ఒకటి తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి రోజుకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగవచ్చు. రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఉదయం అయితే బ్రేక్ ఫాస్ట్ చేశాక తాగాలి.
పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే బిడ్డ అందంగా పుడుతారని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు. అయినప్పటికీ పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగడం వల్ల బిడ్డకు, తల్లికి ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు జరుగుతుంది.
పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగడం వల్ల హైబీపీ రాకుండా చూసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఉదయం వికారం, వాంతులు రాకుండా ఉంటాయి.
కుంకుమపువ్వు కలిపిన పాలను తాగడం వల్ల మూడ్ మారకుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఈ ప్రయోజనాల కోసం గర్భిణీలు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగొచ్చు.