‘మిస్‌మ్యాచ్‌’ మీడియా హడావుడి

-

ఇంతకుముందెన్నడూలేని విధంగా ‘మిస్‌మ్యాచ్‌ అనే చిన్న సినిమాను మీడియా కంపెనీలు ఆకాశానికెత్తేస్తున్నాయి.

‘మిస్‌మ్యాచ్‌’… డిసెంబరు 6న విడుదల కానున్న ఒక చిన్న చిత్రం. ‘ఆటగదరా శివ’ అనే సినిమాలో హీరోగా డీగ్లామరైజ్డ్‌ పాత్ర పోషించిన ఉదయ్‌శంకర్‌ ఈ చిత్ర నాయకుడు. కథానాయికగా తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్యారాజేశ్‌ హీరోయిన్‌.  కొద్దోగొప్పో హీరో కంటే హీరోయినే ఫేమస్‌.

భిన్నాభిప్రాయాలు కలిగిన నాయికానాయకుల మధ్య ప్రేమ, వారి సమస్యలను ఎలా అధిగమించారనేది అసలు కథ. సరే.. ఇటువంటి నేపథ్యంతో చాలా భాషల్లో, చాలా సినిమాలు వచ్చాయి. నడిచినవి నడిచాయి. తేలిపోయినవి పోయాయి. అది వేరే సంగతి. అసలు సంగతేంటంటే, ఈరోజు (5 డిసెంబర్‌) దినపత్రికలన్నింటిలోనూ కథానాయకుడి ఇంటర్వ్యూ ప్రముఖంగా ప్రచురితమైంది. పెద్ద హీరోల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరీ వేసారు. చిన్న సినిమాను చిన్నగానే చూసే ‘ఈనాడు’ సైతం ఆశ్యర్యకరంగా పెద్దగా ఇచ్చింది.

ఇంతకీ విషయమేమిటంటే, ఈ చిత్ర నిర్మాత, హీరోగారి తండ్రి శ్రీరామరాజు, ఒక లెక్చరర్‌. తెలంగాణలోని గద్వాల  స్వస్థలం. ఆయన స్వతహాగా మంచి రచయిత. తత్వశాస్త్ర నిపుణులు. చాలా పుస్తకాలు రాసారు. పెద్దపెద్ద వాళ్లతో సత్సంబంధాలు మెండుగా ఉన్నాయి. సినిమా ప్రిరిలీజ్‌ వేడుకకు కూడా రాఘవేంద్రరావు, వెంకటేశ్‌, సీతారామశాస్త్రి లాంటి ఉద్దండపిండాలు హాజరయ్యారు. ఆ పరిచయాలను ఆయన ఇప్పుడు తనయుడి కోసం విరివిగా వాడారు. దాంతో అన్ని పేపర్ల అధినేతలు తమ సినిమా రిపోర్టర్లకు ఈ సినిమాను విపరీతంగా ప్రోత్సహించాలని మౌఖికాదేశాలు జారీ చేసారు. దాంతో ఇవ్వాళ్టి పేపర్లన్నీ కథానాయకుడి ముచ్చట్లు ఘనంగా రాసారు.

ఎటొచ్చీ సినిమా విడుదల రేపే. ఎటూ మీడియా సంస్థలు రాసే సినిమా సమీక్షలు కూడా సంచలనంగా ఉండే అవకాశాలే ఎక్కువ. అయితే సినిమాలో విషయం లేకపోతే స్టార్లనే వారంలో తిప్పి పంపుతున్నారు జనం. అటువంటిది పేపర్లు ప్రమోట్‌ చేస్తే ఎలా చూస్తారో రేపు తెలుస్తుంది. న్యూస్‌పేపర్లను జనం నమ్మడం మానేసి చాలాకాలమయింది. ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రుజువయింది. ఒకవేళ చిత్రం బాగుంటే మంచిది. పేపర్లు కూడా కొంచెం క్రెడిట్‌ కొట్టేయొచ్చు. బాగుండాలనే ఆశిద్దాం. చిన్న సినిమా బతకడం పరిశ్రమకు మంచది కాబట్టి.

  • రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news