ప్రేమ గుడ్డిది అన్నారు కదా పెద్దలు.. అంటే.. ఎప్పుడు, ఎవరితో, ఎలాంటి వారితో ఎవరు ప్రేమలో పడతారో ఎవరికీ తెలియదు. రూపం, గుణం, వ్యక్తిత్వం తదితర అంశాలను ప్రేమికులు పట్టించుకోరు. కానీ ఒకరికి ఒకరంటే ఇష్టం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అంతే..! అయితే మనుషులు, మనుషులను ప్రేమించడం పెద్ద వింతేమీ కాదు. కానీ.. అదే మనిషి ఒక పురుగును ప్రేమిస్తే..? వినేందుకు చాలా విడ్డూరంగా ఉందే.. అని ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇది నిజమే..! ఇక విషయం ఏమిటంటే…
జపాన్‌కు చెందిన యుటా షినొహర (25) ఒక బొద్దింకతో ప్రేమలో పడ్డాడు. అవును, ఆశ్చర్యపోకండి. ఇది నిజమే. అతను గత ఏడాది కాలంగా ఆ బొద్దింకను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అంతేకాదు, అతను ఆ బొద్దింకకు లీసా అని కూడా పేరు పెట్టాడు. అయితే ఏడాది కాలంగా ఆ బొద్దింకను ప్రేమించాక.. ఇటీవలే ఆ బొద్దింక చనిపోయింది. దీంతో లీసా మరణాన్ని షినొహర తట్టుకోలేకపోయాడు. చివరకు అతను ఆ బొద్దింకను తినేశాడు. ఎందుకని అడిగితే.. ఆ బొద్దింకను తింటే అది తనలోనే ఉంటుందని తాను భావిస్తున్నానని, అప్పుడిక ఆ బొద్దింక తనతో ఎప్పుడూ ఉన్నట్టే అవుతుందని అతను సెలవిచ్చాడు.
యుటా షినొహర తన బొద్దింక ప్రేమాయణం గురించి ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. కావాలంటే మీరు ఆ వీడియోను పైన చూడవచ్చు. ఇక షినొహర మంచి కుక్ కూడా. ఫంక్షన్లకు, పార్టీలకు పురుగులు, వానపాములతో రకరకాల డిష్‌లను తయారు చేసి వడ్డిస్తుంటాడు కూడా. ఏది ఏమైనా షినొహర ఇలా ఓ బొద్దింకతో ప్రేమాయణం నడిపిన వార్త మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది..!