శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. బాడీలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. రోగనిరోధక శక్తి ఉండాలి. ఇమ్యునిటీ పవర్ లేకపోతే..సూక్ష్మక్రిములు పేరుకుపోతాయి. మన శరీరం వాటిని నాశనం చేయలేదు. సూక్ష్మక్రిముల పనిపట్టాలంటే.. బాడీలో తెల్లరక్తకణాలు సరిపడా ఉండాలి. వాస్తవానికి ఒక మైక్రో లీటర్‌కు కనీసం 5వేల నుంచి 10వేల వరకు తెల్ల రక్త కణాలు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉంటే సమస్యే. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. ఇక ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉంటే.. ఏం జరుగుతుందో అందిరకీ తెలిసిందే.. తెల్ల రక్తకణాల సంఖ్య పెంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి.. మీకు ఈ సమస్య ఉంటే.. వెంటనే ఈ ఆహారాలను డైట్‌లో యాడ్ చేసేయండి.
జింక్
నిత్యం 15 నుంచి 20 మిల్లీగ్రాముల మోతాదులో మనకు జింక్ అవసరం అవుతుంది. జింక్ ఎక్కువగా సీ ఫుడ్, తృణ ధాన్యాలు, పాలు, పాల సంబంధ ఉత్పత్తులు, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలు తదితర ఆహారాల్లో మనకు లభిస్తుంది. జింక్ ఉన్న ఆహారలను తినడం వల్ల కూడా శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెంచుకోవచ్చు..
సెలీనియం
సెలీనియం రోజుకు 200 ఎంసీజీ మోతాదులో అవసరం అవుతుంది. ఇది చేపలు, చికెన్, యాపిల్స్, వెల్లుల్లి, టమాటాలు, గుమ్మడికాయ విత్తనాలు తదితర ఆహారాల్లో మనకు లభిస్తుంది. సెలీనియం ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రతిదానికి సీ ఫుడ్స్ అంటున్నారు.. అంటే డైలీ చేపలు తినమంటారా ఏంటీ అని మీకు డౌట్ రావొచ్చు.. చేపలు వారానికి మూడు రోజులు తిన్నా ఎలాంటి సమస్య ఉండదు.. అన్ని రోజులు తినలేం, కొనలేం అనుకునే వాళ్లు…మిగిలిన వాటిని తినండి.. కనీసం వారానికి ఒక్కసారైన చేపలు, రొయ్యలు లాంటివి తినేలా ప్లాన్ చేసుకోండి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. అలాగే శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతాయి.
విటమిన్ సి
విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం… విటమిన్ సి వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య సులభంగా పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. నారింజ, కివీలు, నిమ్మకాయలు, క్యాప్సికం వంటి ఆహారాల ద్వారా మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ ఇ
విటమిన్ ఇ వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం 60 మిల్లీ గ్రాముల మోతాదులో విటమిన్ ఇ మనకు అందేలా చూసుకోవాలి. అంటే విటమిన్ ఇ ఉండే ఆహారాలను తినాలి. బాదంపప్పు, అవకాడో, కొత్తిమీర, చేపలు, గుమ్మడికాయ విత్తనాలు తదితర ఆహారాలను తినడం ద్వారా విటమిన్ ఇ పుష్కలంగా అందుతుంది. దీంతో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవచ్చు.
విటమిన్ ఏ
రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మాత్రమే కాదు, తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచేందుకు కూడా విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. ఇది మనకు యాపిల్స్, క్యారెట్లు, పాలకూర తదితర ఆహారాల్లో లభిస్తుంది.
కెరోటినాయిడ్స్
టమాటాలు, నారింజ, బొప్పాయి, చిలగడదుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి పదార్థాల్లో కెరోటినాయడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఇవి గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి..
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు
చేపలు, అవిసె గింజెలు, నట్స్‌లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఘోరంగా ఉంటాయి..ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అలాగే తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతాయి..
ఒక్క తెల్లరక్తకణాలకు మాత్రమే కాదు.. వీటిల్లో కొన్ని అయినా..మీరు డైలీ తినగలిగితే.. ఆరోగ్యంగా ఉండొచ్చు.. పైన చెప్పినవి మరీ అంత ఖర్చుతో కూడుకున్నవి అయితే కాదు. ఆరోగ్యం కంటే..ఎక్కువ ఏదీ ఉండదు.. ఒక్కసారి మీరు రోజూ ఏం తింటున్నారు.. వాటి వల్ల మనకు ఎలాంటి పోషకాలు అందుతున్నాయి, ఎంత చెడు జరుగుతుందో ఆలోచించుకోండి. మీ వయసు ఎంతైనా..బాడీకి సరిపడా పోషకాలు అందకపోతే.. భవిష్యత్తులో రోగాల భారినపడక తప్పదు..!