లేజర్ హెయిర్ రిమూవర్ మంచిదా? కాదా? వీళ్లకు అయితే బెటర్ అట..!

ప్రస్తుతం ఆడవారి ఫ్యాషన్ ప్రపంచానికి స్లీవ్ లెస్ దుస్తులు ఇంకాస్త అందాన్ని ఇస్తున్నాయి. అయితే ఇలాంటివి వేసుకోవాలంటే..అవాంఛిత రోమాలు ఉండకూడదు. ఉంటే అలాంటి డ్రస్ లు వేసుకుంటే బాగుండదు. చాలామది వీటిని తీసేయటం కోసం..వ్యాక్సింగ్, షేవింగ్ వాడతారు..కాస్త ముందుకెళ్తే మరికొందరు లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకుంటారు. దీనివల్ల ఎంచక్కా ఇక ఈ అవాంఛిత రోమాల సమస్య ఉండదు. పైసల్ ఎక్కువైనా పర్మినెంట్ రిజల్ట్ ఉంటుందని కొందరు అనుకుంటారు. అయితే ఇంకొతమందికి వీటిని చేయించుకోవాలంటే వంద అనుమానాలు, వేయి ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఇది మంచిదేనా కదా..అంత డబ్బు పెట్టి చేయిస్తే మనకు మళ్లీ రోమాలు వస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి మీ సందేహాలన్నీ ఈరోజు నివృత్తి చేసుకుందాం.

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌.. అవాంఛిత రోమాల్ని శాశ్వతంగా తొలగించడానికి చేసే చికిత్స. ఇందులో భాగంగా అత్యంత శక్తిమంతమైన కాంతి పుంజాన్ని చర్మంపై పడేలా చేసి.. రోమాలు మొలిచే హెయిర్‌ ఫాలికల్‌ని నశింపజేస్తారు . ఫలితంగా కొత్త రోమాలు పెరగకుండా ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ వల్ల దీర్ఘకాలం పాటు అవాంఛిత రోమాలు పెరగవు… కానీ అందరి విషయంలో ఇది వర్కవుట్‌ కాకపోవచ్చంటున్నారు నిపుణులు.

వాళ్లకు ఎక్కువ యూస్ అవుతుందట!

శరీర భాగంలోని అవాంఛిత రోమాలు ఉండే ఏ ప్రదేశంలో అయినా..లేజర్‌ పద్ధతిలో తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే జుట్టు రంగు, చర్మ రంగును బట్టి ఈ చికిత్స సక్సెస్‌ రేటు ఆధారపడి ఉంటుంది. అదెలాగంటే.. వెంట్రుకల్లోని మెలనిన్‌ వర్ణద్రవ్యం లేజర్‌ కిరణాలను మరింత సమర్థంగా ఆకర్షిస్తుంది.. కాబట్టి నల్లటి రోమాలు, తెల్లటి చర్మ ఛాయ కలిగిన వారి విషయంలో లేజర్‌ చికిత్స సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా.. వెంట్రుకలు నల్లగానే ఉండి, చర్మ ఛాయ కూడా తక్కువగా ఉన్నట్లయితే.. వెంట్రుకల్లోని మెలనిన్‌ని లేజర్‌ అంత త్వరగా గుర్తించలేదు. ఈ క్రమంలో చర్మంలోని మెలనిన్‌ లేజర్‌ని ఆకర్షించి.. ఫలితంగా చర్మం డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది నిపుణులు అంటున్నారు. అందుకే ఇలాంటి వారికోసం ప్రత్యేక లేజర్‌ చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉంది.

చేయించుకునే ముందు..!

లేజర్‌ చికిత్స మీ చర్మతత్వానికి సరిపడుతుందో లేదా అని ముందుగా చర్మ సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఆపై వారి సూచన మేరకు చేయించుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ చికిత్స తీసుకోవాలని అనుకుంటే మాత్రం ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

కొన్ని రోజుల ముందు నుంచే ఎండలో ఎక్కువ సమయం గడపకుండా చూసుకోవాలి. ఎందుకంటే ట్యాన్‌ ఏర్పడిన చర్మంపై లేజర్‌ చికిత్స చేయరు.

చర్మానికి సరిపడని సౌందర్య ఉత్పత్తులు వాడడం, అలర్జీకి కారణమయ్యే ఆహార పదార్థాలు తినడం ఆపేయాలి.

వ్యాక్సింగ్‌, ప్లకింగ్‌.. వంటి అవాంఛిత రోమాలు తొలగించుకునే పద్ధతులకు దూరంగా ఉండాలి. అయితే లేజర్‌కి ఒకరోజు ముందు షేవింగ్‌ చేసుకోవచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడకూడదు. ఎందుకంటే వాటిని వాడడం వల్ల చికిత్స తీసుకునే క్రమంలో రక్తస్రావమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

చర్మంపై ఏవైనా ఇన్ఫెక్షన్లున్నట్లయితే ఈ చికిత్స చేయించుకోకూడదు. అలాగే వంశపారంపర్యంగా ఏవైనా చర్మ సమస్యలున్నట్లయితే అలాంటి వారు ఈ విషయంలో నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.

కనురెప్పలు-కంటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఈ చికిత్స చేయరు.. అలాగే ట్యాటూస్‌ వేయించుకున్న చర్మ ప్రదేశంలో కూడా లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స చేయకూడదంటున్నారు నిపుణులు.

ఈ దుష్ప్రభావాలు టెంపరరీయే..!

దాదాపు అందరికీ లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స సరిపడినా.. కొంతమందిలో మాత్రం కొన్ని రకాల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అయితే అవి కూడా తాత్కాలికమేనట..దీర్ఘకాలికంగా ఏం ఉండవు.

వ్యాక్సింగ్‌ చేయించుకున్న చోట చర్మం ఉబ్బడం, ఎరుపెక్కడం సహజమే! లేజర్‌ చికిత్స తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇవి కొన్ని గంటల్లోనే తగ్గిపోతాయని.. ఈ క్రమంలో వాపు, నొప్పిగా అనిపిస్తే ఐస్‌ ప్యాక్‌ వేసుకోవచ్చట.

లేజర్‌ చికిత్స తర్వాత పిగ్మెంటేషన్‌ సమస్య కూడా తలెత్తచ్చట! అంటే.. తెల్లగా ఉన్న వారి చర్మంపై నల్లటి మచ్చలు, నల్లగా ఉన్న వారి చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడడం సహజమని, అయితే ఇదీ తాత్కాలికమే అంటున్నారు నిపుణులు.

కొంతమందిలో లేజర్‌ చికిత్స తర్వాత ఆయా భాగంలో చర్మం రంగు మారడం గమనించచ్చు. అయితే చాలా అరుదుగా మాత్రమే ఈ మారిన చర్మ రంగు శాశ్వతంగా ఉండిపోయే అవకాశాలున్నాయట.

లేజర్‌ చికిత్స తర్వాత డాక్టర్‌ సలహాలు పాటించడం, చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహించడం, మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం.. వంటి చిన్న పాటి చిట్కాలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు.

లేజర్ చికిత్సలో ఉన్న అపోహలు

ఈ చికిత్స కారణంగా క్యాన్సర్‌ వస్తుందన్న భయం చాలామందిలో ఉంది. అయితే ఇది పూర్తిగా అపోహే మాత్రమే. ఎందుకంటే లేజర్‌ కిరణాల్లో రేడియేషన్‌ తక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఉపరితలానికే పరిమితమవుతుందే తప్ప లోపలి దాకా వెళ్లదు. తద్వారా క్యాన్సర్‌ వచ్చే అవకాశమే లేదంటున్నారు నిపుణులు.

బికినీ ఏరియాలో లేజర్‌ చికిత్స తీసుకోవడం వల్ల సంతాన సమస్యలొస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇదీ ఓ అపోహే అని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఒకవేళ అంతగా సందేహమున్నా, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తోన్న వారు ఓసారి నిపుణుల్ని సంప్రదించాకే ముందుకెళ్లడం ఉత్తమం.

ఇక గర్భిణులు లేజర్‌ చికిత్స తీసుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే లేజర్‌ కిరణాలు బిడ్డపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయన్న విషయం ఇంకా అధ్యయన దశలోనే ఉందట. కాబట్టి ఎందుకొచ్చిన రిస్క్ డెలివరీ అయ్యాకే ప్లాన్ చేసుకోవటం బెటర్.

ఏదేమైనా కచ్చితంగా చికిత్స తీసుకోవాలనుకున్న వారు మాత్రం అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో తీసుకోవడమే అన్ని రకాలుగా మేలు. తక్కువ ఖరీదుకే చేస్తున్నారని కమిట్ అయిపోకండి..మంచి ప్రొఫిషనల్స్ తోనే ఇలాంటి చికిత్సలు చేయించుకోవటం ఉత్తమైన మార్గం.

ఇందుకు రెడీగా ఉండండి..!

లేజర్‌ చికిత్సలో భాగంగా కనిష్ఠంగా ఆరు సిట్టింగ్స్ నుంచి గరిష్ఠంగా ఇరవై సిట్టింగ్స్‌ దాకా పాల్గొనాల్సి ఉంటుందట! అంటే మీ చర్మంలో అవాంఛిత రోమాలు వచ్చే హెయిర్ ఫాలికల్స్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని సిట్టింగ్స్ పడతాయి.

చికిత్స తర్వాత చర్మం మరింత సున్నితంగా మారుతుంది. కాబట్టి ఒకట్రెండు రోజుల పాటు ఎండలోకి వెళ్లడం, ఈత కొట్టడం.. వంటి పనులు మానుకోవాలి.

చాలామంది విషయంలో ఈ లేజర్‌ చికిత్స సత్ఫలితాలనిచ్చినా.. కొంతమందిలో మాత్రం కొన్నేళ్ల తర్వాత రోమాలు తిరిగి పెరిగే అవకాశాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇది కూడా దృష్టిలో ఉంచుకుంటే ఆ సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఒక విధంగా రిస్క్ చేయాల్సిందే. మీరు గట్టిగా ఫిక్స్ అయిపోతే స్టెప్ తీసుకోండి. లేదు..ఎందుకొచ్చిన రిస్క్ అనుకంటే వేరే ఆప్షన్ ఎలాగో ఉన్నాయి కదా..