ఎన్నిసార్లు నీళ్లు తాగినా దాహం తీరడం లేదా.. అయితే ఈ రోగాలు రావొచ్చు..

-

ఒక పూట అన్నం లేకున్నా ఉండొచ్చు కానీ..దాహాన్ని మాత్రం అస్సలు ఆపుకోలేమో.. బాగా దాహం వేసినప్పుడు వాటర్‌ తాగితే ప్రాణం లేచివచ్చినట్లు అనిపిస్తుంది కదూ.. శరీరానికి సరిపడా నీరు లేకపోతే బాడీలో అనేక సమస్యలు బయటేస్తాయి. అయితే కొన్నిసార్లు ఎంత నీరు తాగినా మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. అస్సలు దాహం తీరదు. ఇలాంటి లక్షణాలు మీలో కూడా తరచూ కనిపిస్తున్నాయా.? అయితే అది ఈ రోగాలకు సంకేతం కావొచ్చు..!
మధుమేహం: మధుమేహం వల్ల బాగా దాహం వేస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారు మూత్రవిసర్జన అధికసార్లు వెళ్తుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం దానిని మూత్రం ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా నిర్జలీకరణం జరుగుతుంది. దీని వల్ల దాహంగా అనిపిస్తుంటుంది.
డయాబెటిక్ కీటోయాసిడోసిస్- షుగర్‌ ఉన్నవారికి శక్తిని అందించడానికి కణాలలోకి గ్లూకోజ్ చేరకుండా నిరోధించే సమస్య ఉంటుంది. ఇది శరీరంలో కీటోన్‌లను పెంచుతుంది. ఇది ఆమ్లంగా మారి.. కీటోయాసిడోసిస్‌కు దారితీస్తుంది. ఇది మూత్రవిసర్జనను బాగా ప్రభావితం చేస్తుంది. అలాగే దాహాన్ని కూడా పెంచుతుంది. కీటోయాసిడోసిస్ అనేది ప్రాణాంతక సమస్య. పొడి చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, మైకం కమ్మడం, కోమా వంటివి కెటోయాసిడోసిస్ ప్రధాన లక్షణాలు. షుగర్‌ పేషంట్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
గర్భం: చాలా మంది గర్భిణీలకు కూడా తరచు దాహంగా అనిపిస్తుంటుంది. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ గర్భధారణ సమయంలో కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో సంభవించే మధుమేహానికి సంకేతం కావచ్చు.
డీహైడ్రేషన్: వేసవిలో ఎండ వేడిమికి ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల డీహైడ్రేషన్ అవుతుంది. అప్పుడు దాహం వేయడం, అతిసారా, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అలాగే పొడి చర్మం, పగిలిన పెదవులు, అలసట, మైకం కమ్మడం, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
మొత్తానికి ఇలా నీళ్లు ఎన్నిసార్లు తాగినా మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తే..అది దాదాపు మధుమేహానికే సంకేతంగా ఉంది కాబట్టి వైద్యులను సంప్రదించి పరీక్షించుకుని చికిత్స ప్రారంభించడం ఉత్తమం.!

Read more RELATED
Recommended to you

Latest news