మీలో మార్పు రావాలని మీకు మీరు సంకెళ్ళు వేసుకుంటున్నారా? ఒకసారి ఇది తెలుసుకోండి

మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికీ జీవితం ఒక్కోలా ఉంటుంది. ఇతరులను చూసుకుని నేనలా ఎందుకు లేనే అని మీలో మీరే మధనపడిపోతూ ఉన్న జీవితాన్ని పాడుచేసుకోవడం సమంజసం కాదు. చాలామందికి అర్థం కాని విషయం ఇదే. ఎదుటివారిలా విజయం సాధించడానికి వారిలా తయారవ్వాలని అనుకుని, మనకు పెద్దగా ఇష్టం లేకపోయినా, అవతలి వారిలా మారాలని ప్రయత్నిస్తారు. ఈ ప్రాసెస్ లో తమని తాము కోల్పోతున్నామనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు.

inspiration
inspiration

ఈ సకల చరాచర సృష్టిలో నువ్వొక్కడివే. ఈ ప్రపంచంలో నువ్వు ప్రత్యేకం. నీ అలవాట్లు నీవే. నీలా నువ్వుండాలి. నీకందాన్ని ఇచ్చే పనులు మాత్రమే చేయాలి. అలా అని ఎదుటి వారిని గిల్లడం నా ఆనందం అనుకుంటే, అవతలి వారికి కూడా అదే అలవాటు ఉండి, వారి గిల్లుడు మీకన్న ఇంకా పెద్దదైతే నష్టపోయేది మీరే. అందుకే మీ స్వేఛ్ఛని అవతలి వారిని బాధపెట్టడానికి కాకుండా మీరు సంతోషంగా ఉండడానికి మాత్రమే ఉపయోగించాలి.

ఐతే ఇప్పుడున్నట్లుగా కాకుండా నాలో మార్పు రావాలని, దానికి తగినట్టుగా అలవాట్లను మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఆ అలవాట్లు ఉంటేనే జీవితంలో నెగ్గుకు రాగలమని భావిస్తారు. అలా అని చాలా బలంతో కొత్త అలవాట్లను, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ అందులో ఫెయిలవుతారు. ఆ ఫెయిల్యూర్, వారిని నిరాశలోకి దిగజారుస్తుంది. అక్కడ నుండి డిప్రెషన్, నావల్ల ఎందుకు కావట్లేదన్న బాధ, నేనిందుకిలా చేస్తున్నానన్న అసహనం పెరిగి తమ మీద తమకే కోపం పెరిగి, అది జీవితాన్ని బలి తీసుకునే దాకా వెళ్ళవచ్చు.

అందుకే మీకు ఆనందం ఇవ్వని ఎలాంటి అలవాట్లను బలవంతంగా అలవర్చుకోవద్దు. ఇది మీ జీవితం. ఇక్కడ జరిగే ఏదైనా మీకు ఆనందాన్ని పంచాలి.