బహిరంగ ప్రదేశాల్లో చంటి పిల్లలకు పాలివ్వడం తల్లులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అసలే నేటి సమాజంలో మృగాళ్లు ఎక్కువైపోయారు. ఈ క్రమంలో వారు పిల్లలకు పాలిచ్చే తల్లులనూ కామంతోనే చూస్తారు. అయితే ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికే కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇకపై అక్కడి మెట్రో స్టేషన్లలో పిల్లలకు పాలిచ్చేందుకు తల్లుల కోసం ప్రత్యేకంగా చిన్నపాటి పాడ్ (గది)లను అందుబాటులో ఉంచారు.
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్) 9 మంత్స్ అనే ఓ స్టార్టప్, మరో ప్రైవేటు హాస్పిటల్‌ల సౌజన్యంతో ఇటీవలే అక్కడి అలువా అనే మెట్రో స్టేషన్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌ను ఏర్పాటు చేశారు. ఆ పాడ్ 4 ft x 4 ft సైజులో ఉంటుంది. అందులో మహిళలు పిల్లలకు కూర్చుని పాలిచ్చేందుకు సౌకర్యవంతమైన ఏర్పాటు చేశారు. అలాగే ఆ పాడ్‌లో ఓ చార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే మెట్రో స్టేషన్‌కు వచ్చే తల్లులు ట్రెయిన్ ఎక్కేందుకు సమయం ఉంటే ముందుగా ఆ పాడ్‌లోకి వెళ్లి అవసరం అనుకుంటే పిల్లలకు పాలివ్వవచ్చు. కాగా దేశంలోనే ఇలా ఓ మెట్రో స్టేషన్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్ ను ఏర్పాటు చేయడం తొలిసారి.
అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌లను త్వరలోనే మరిన్ని మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తామని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ మహమ్మద హనీష్ తెలిపారు. కొచ్చిలోని ఎదప్పల్లి, ఎంజీ రోడ్, లిస్సీ స్టేషన్లలో మరో మూడు పాడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే, బస్ స్టేషన్లలో ఇలాంటి పాడ్‌లను ఏర్పాటు చేస్తే పాలిచ్చే తల్లులకు సౌకర్యవంతంగా ఉంటుందని, బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని 9 మంత్స్ స్టార్టప్ ప్రతినిధులు చెబుతున్నారు. వారు త్వరలో ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేయనున్నామని వెల్లడించారు. ఏది ఏమైనా.. పాలిచ్చే తల్లుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌లను ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమే..!