రామ్‌వీర్ తన్వార్ వృత్తి రీత్యా ఇంజినీర్. గ్రేటర్ నోయిడా నివాసి. అయితే తాము ఉంటున్న ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటల పరిస్థితి చూసి ఆవేదన చెందాడు.
నేటి తరుణంలో సమాజంలోని ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో కాలుష్యం కూడా ఒకటి. కాలుష్యం బారిన పడి చెరువులు, కుంటలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి. అయినా పట్టించుకునే వారే లేరు. నేడు దేశంలో ఏ ప్రాంతంలో చూసినా చెరువులు, కుంటలు దయనీయ స్థితిలో ఉన్నాయి. చాలా మందీ చూసీ చూడనట్లు వెళ్లేవారే కానీ.. ఎవరూ సమస్యను పరిష్కరిద్దామని ఆలోచించడం లేదు. అయితే ఆ యువకుడు మాత్రం అలా కాదు. తాను ఉంటున్న ప్రాంతంలోని చెరువులు, కుంటలు చెత్త, వ్యర్థాలతో దుర్గంధ భరితంగా మారితే వాటిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే కొన్ని చెరువులు, కుంటలను శుభ్రం కూడా చేశాడు. అతనే గ్రేటర్ నోయిడాకు చెందిన రామ్‌వీర్ తన్వార్.
రామ్‌వీర్ తన్వార్ వృత్తి రీత్యా ఇంజినీర్. గ్రేటర్ నోయిడా నివాసి. అయితే తాము ఉంటున్న ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటల పరిస్థితి చూసి ఆవేదన చెందాడు. చెత్త, వ్యర్థాలతో అవి కంపు కొడుతుండేవి. దీంతో వాటిలోకి జంతువులు తప్ప మనుషులెవరూ వెళ్లేవారు కాదు. అందరూ వాటిని చూస్తూ వెళ్లేవారే తప్ప వాటిని బాగుచేద్దామని ఎవరూ అనుకోలేదు. కానీ రామ్‌వీర్ అనుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తమ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలను శుభ్రం చేసే పనిలో పడ్డాడు.
అలా రామ్‌వీర్ ఓ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా మొదట్లో అతనికి ఇతరుల నుంచి సహకారం అంతగా లభించలేదు. దీనికి తోడు అతను ఉద్యోగం కూడా మానేయడంతో ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయితేనేం.. భయపడలేదు. క్రమంగా స్థానికంగా ఉన్న డాబ్రా కుంటను బాగు చేయడం మొదలు పెట్టాడు. యంత్రాలు, కూలీల సహాయంతో కుంటను బాగు చేశాడు. ఆ తరువాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. పలు స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి కూడా అతనికి సహకారం అందింది. దీంతో అతను ఇప్పటికి గ్రేటర్ నోయిడాలో ఉన్న 10 నీటి కుంటలను శుభ్రం చేశాడు.
రామ్‌వీర్ కుంటలను శుభ్రం చేయడం ఏమోగానీ ఇప్పుడక్కడ కుంటలకు కొత్త రూపం వచ్చింది. గతంలో మనుషులు అడుగు పెట్టలేనంత కాలుష్యం, చెత్త, వ్యర్థాలతో ఆ కుంటలు ఉండేవి. కానీ ఇప్పుడు శుభ్రమైన నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే ఆ కుంటల్లో ఉండే నీటిని ప్రజలు అనేక అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు కూడా. ఇదంతా రామ్‌వీర్ చలవే అని అక్కడ చుట్టు పక్కల ఎవరిని అడిగినా చెబుతారు. అయితే ఈ యజ్ఞం ఇప్పటితో ఆగదని, ఇక ముందు కూడా మరిన్ని కుంటలను శుభ్రం చేస్తానని రామ్‌వీర్ చెబుతున్నాడు. అతను పడుతున్న శ్రమకు, చేస్తున్న సామాజిక సేవకు అందరం అతన్ని అభినందించాల్సిందే..!