చత్తీస్‌గడ్‌లో రోజు రోజుకీ పెరుగుతున్న మావోయిస్టుల ఆగడాలను నియంత్రించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా దళాలు తాజాగా మహిళా కమాండోలతో దంతేశ్వరి లడకే అనే బృందాన్ని ఏర్పాటు చేశాయి.
ఛత్తీస్‌గఢ్‌లో రోజు రోజుకీ మావోయిస్టుల ప్రాబల్యం అంతకంతకూ పెరిగిపోతున్న విషయం విదితమే. గత కొద్ది రోజుల కిందటే మావోయిస్టులు పోలీసు వ్యాన్‌ను పేల్చేయగా ఆ దాడిలో 16 మంది పోలీసులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టుల చర్యలు అటు ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలోనే చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమాండోలను నియమించింది. ఆ కమాండోల బృందానికి దంతేశ్వరి లడకే అని పేరు కూడా పెట్టడం విశేషం.
చత్తీస్‌గడ్‌లో రోజు రోజుకీ పెరుగుతున్న మావోయిస్టుల ఆగడాలను నియంత్రించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా దళాలు తాజాగా మహిళా కమాండోలతో దంతేశ్వరి లడకే అనే బృందాన్ని ఏర్పాటు చేశాయి. అందులో మొత్తం 30 మంది మహిళా కమాండోలు ఉన్నారు. ఇక వారిలో 10 మంది మహిళలు గతంలో నక్సలైట్లుగా పనిచేసిన వారే అయి ఉండడం విశేషం.
ఒకప్పుడు మావోయిస్టులుగా పనిచేసిన 10 మంది మహిళలకు ట్రెయినింగ్ ఇచ్చి మహిళా కమాండోల విభాగంలోకి తీసుకున్నారు. దీంతో వారు మరో 20 మంది మహిళా కమాండోలు.. మొత్తం 30 మంది కలసి బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టుల ఏరివేతకు నడుం బిగించారు. ఆ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోలు ప్రత్యేకంగా సేవలను అందించనున్నారు. కాగా ఎంతో కాలంగా చత్తీస్‌గడ్‌లో తమ సామ్రాజాన్ని విస్తరించుకుంటున్న మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు ఈ మహిళా కమాండో బృందం చాకచక్యంగా వ్యవహరిస్తుందని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. మహిళా కమాండోలు సమర్థంగా విధులు నిర్వహిస్తారని అన్నారు. అందుకే వారికి ఈ బాధ్యతను అప్పగించామని సిన్హా తెలిపారు.