పగబట్టిన పాము ఒకసారి కాటు వేస్తే చావలేదని రెండో సారి కూడా అదే చోట..

-

పాములు పగబడతాయని చాలా మంది నమ్ముతారు. ఒక్కసారి పాము పగబట్టింది అంటే ఆ వ్యక్తి అంతు చూసే వరకూ వదలదని, ఎలా అయినా వచ్చి కాటేస్తుందని అంటారు. కొందరు అయితే ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిపై పాము పగబట్టినట్లుంది. ఒకసారి కాటు వేస్తే చనిపోలేదని రెండోసారి కూడా కాటు వేసింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ జిల్లా మెహ్రాన్ గఢ్ గ్రామానికి చెందిన జసాబ్ ఖాన్ (44) అనే వ్యక్తి తాజాగా పాము కాటుకు గురయ్యి ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై పాము పగబట్టిందని స్థానికులు అంటున్నారు. అతడు చనిపోయే వరకు పాము తన వెంట పడిందట. వాళ్లు అలా ఎందుకు అంటున్నారంటే.. ఐదు రోజుల క్రితం జసాబ్ ఖాన్‌ను పాము కాటు వేసింది. వెంటనే జసాబ్ ఖాన్ కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయగా.. అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేయగా అతడికి ప్రాణాపాయం తప్పింది. కొన్ని రోజులు ఆస్పత్రిలో నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు.

జూన్ 20న పాము కాటు వేయగా ఆస్పత్రిలోనే ఉండి రెండు, మూడ్రోజులకు ఇల్లు చేరాడు జసాబ్ ఖాన్. మొదటి పాము కాటు వేసిన ఐదు రోజుల తర్వాత జూన్ 26న మరోసారి జసాబ్ ఖాన్ ను పాము కాటు వేసింది. ఈసారి కూడా అతడిని కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే జోధ్ పూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. జసాబ్ ఖాన్ అక్కడ చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయాడు. జసాబ్ ఖాన్‌ రెండు సార్లు వైపర్ రకానికి చెందిన ‘బండి’ అనే పాము కాటుకు గురయ్యాడు. ఈ రకం పాములు ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఒకే చోట రెండుసార్లు కాటేసిందంటే..

జసాబ్ ఖాన్ ను వైపర్ ‘బండి’ పాము రెండు సార్లు ఒకే ప్రాంతంలో కాటు వేసింది. కాలి చీలమండపైనే పాము కాటేసింది. మొదటి సారి పాము కాటు నుంచి జసాబ్ ఖాన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. అతడు పూర్తిగా కోలుకోలేదు. మరోసారి అదే ప్రాంతంలో అదే స్థాయి విషం ఉన్న పాము కాటు వేయడంతో ఆ విష ప్రభావాన్ని జసాబ్ ఖాన్ శరీరం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు అంటున్నారు. ఈ విషాదకర ఘటనపై భనియానా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జసాబ్ ఖాన్ కు తల్లి, భార్య, నలుగురు కుమార్తెలు, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. పాములతో జర జాగ్రత్తగానే ఉండాలి. అవి మన జోలికి వచ్చినా మనం వాటి జోలికి వెళ్లినా డేంజరే మనకే.

Read more RELATED
Recommended to you

Exit mobile version