సోషల్ మీడియ పిచ్చిలో పడి.. లైక్స్, వ్యూస్ కోసం.. జనాలు తిప్పలు పడుతున్నారు.. డిఫరెంట్‌గా చేస్తేనే..క్లిక్ అవుతుందని అందరికీ అర్థమైపోయింది.. దాని కోసం.. సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీకోసం ప్రాణాలు పోగుట్టుకున్న వారిని చూసి ఉంటాం.. ప్రాణాలు పోగుట్టుకోవడానికే.. సెల్ఫీ దిగాడు ఆ యువకుడు.. శివుడి మెడలో పాము ఉంటుందిగా..అలానే తాను పామును వేసుకుని ఫోటో దిగాడు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం, బొద్దికూరపాడుకు చెందిన మణికంఠరెడ్డి అనే పాతికేళ్ల యువకుడు కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో జ్యూస్ స్టాల్ నడుపుతుండేవాడు.. మంగళవారం సాయంత్రం తన పక్కనే ఉన్న మరో షాపుకు పాములు ఆడించే వ్యక్తి రావడంతో అతని దగ్గరున్న పామును మెడలో వేసుకొని ఫోటో దిగాలని…దాంతో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డాడు. అదే విషయాన్ని పాములు ఆడించే వ్యక్తి వెంకటస్వామికి చెప్పాడు. అతను కూడా సరే అనడంతో తాచు పామును మెడలో వేసుకున్నాడు. ఫోటోలు తీయని పక్క షాపులో పని చేస్తున్న కుర్రాడికి తన సెల్‌ఫోన్ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. పాము మెడలో ఉన్నంత సేపు ఏం కాలేదు. తీసి కింద వదిలిపెడుతుండగా మెడపై కాటు వేసేసింది…
పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు మణికంఠరెడ్డి. పాము కాటుతో చనిపోయిన విషయాన్ని డాక్టర్లు మృతుని తల్లిదండ్రులకు తెలియజేయడంతో షాక్ అయ్యారు. అయితే పాముతో సెల్ఫీలు దిగిన విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారని కందుకూరు ఆసుపత్రిలోనే తన సెల్‌ఫోన్‌లో ఉన్న పాము సెల్ఫీ ఫోటోలు డిలీట్ చేసినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఐదేళ్ల క్రితమే మణికంఠరెడ్డి సోదరుడు ఇంద్రారెడ్డి కిడ్నీ సంబంధిత సమస్యతో చనిపోయాడని బంధువులు తెలిపారు. చేతికి అందొచ్చిన ఇద్దరు కొడుకులు దూరమైన దంపతులు అనాథలయ్యారు..మణికంఠరెడ్డి ఫిర్యాదుతో పాములు ఆడించే వ్యక్తి వెంకటస్వామిపై పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు..