వందేళ్ల ఎన్టీఆర్ మన మధ్యే ఉన్నారు
ఆత్మ గౌరవ పతాక మాదిరి నింగిని తాకుతూ ఉన్నారు
నింగి నుంచి నేల వరకూ విస్తరించి ఉన్నారు
తెలుగు జాతి వెలుగుకు కారణం అయి ఉన్నారు
అనండిక తమ్ముళ్లూ ! జోహార్ ఎన్టీఆర్ అని……….
ఆత్మ గౌరవ పతాక మాదిరి నింగిని తాకుతూ ఉన్నారు
నింగి నుంచి నేల వరకూ విస్తరించి ఉన్నారు
తెలుగు జాతి వెలుగుకు కారణం అయి ఉన్నారు
అనండిక తమ్ముళ్లూ ! జోహార్ ఎన్టీఆర్ అని……….
ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన్రోజు.. తెలుగు జాతికి పండుగ రోజు.. ఆయనకు శుభాకాంక్షలు.. శత వసంతాల వేళ .. వారి కీర్తికీ ఖ్యాతికీ వందనాలు చెల్లిస్తూ.. తెలుగుదేశం నాయకులు మహానాడుకు శ్రీకారం దిద్దనున్నారు మరి కాసేపట్లో.. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఒంగోలులో మండువవారిపాలెంలో మహానాడుకు రెండ్రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం ఇది.నందమూరి తారక రామారావు అనే పేరు వెనుక ఓ మహత్తర శక్తి ఉంది. ఆ శక్తి తెలుగుదేశం ఆవిర్భావానికి, తెలుగు దేశం వైభవ ప్రాభవాలకూ కారణం అయింది. ఎన్టీఆర్ అంటే గొప్పనైన క్రమశిక్షణ ఉన్న నేత. ముఖ్యంగా తెలుగు నేలపై సామాన్య కుటుంబం నుంచి ఎదిగివచ్చిన నేత. మంచి చదువు, భాషపై పట్టు, ప్రేమ, ప్రజలకు ఏమయినా చేయాలన్న తలంపు, ముఖ్యంగా పద్య సాహిత్యం తెలిసిన నైజం.. ఎదుటివారిని సమున్నత రీతిలో గౌరవించే తత్వం ఇవన్నీ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి నాయకులు నేర్చుకోవాలి. ఇప్పటి నాయకులు ప్రజలకు మేం డబ్బులు పంచుతున్నాం కనుక ప్రజలు మాకు ఓట్లేస్తారు అని చెబుతున్నారే !
అది ఎంత తప్పు ! ఎన్టీఆర్.. ఆ తరహా మాటలు చెప్పలేదు. ఆ మాటకు వస్తే ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎదిగిన వైఎస్సార్ కూడా ఏనాడూ ఆ మాట చెప్పలేదు. ఎన్టీఆర్ మాదిరిగానే ఆత్మ గౌరవ నినాదం వినిపించిన వైఎస్సార్ కూడా గొప్ప నాయకుడు అయ్యారంటే కారణం ప్రజలను గౌరవించడమే.. బాధిత వర్గాలను గౌరవించడమే.. ఆ గౌరవమే ఇవ్వకుంటే ఇవాళ ఆ ఇద్దరు ఇంతటి స్థాయిలో తెలుగు వారిని ప్రభావితం చేసి ఉండేవారు కాదు.
ఎన్టీఆర్ లో మరో మంచి గుణం ఆత్మ గౌరవం.. ఆత్మ విశ్వాసం.. సాహసించే గుణం.. ఎదిరించే నైజం..ఇవన్నీ ఆయన్ను పెద్దాణ్ని చేశాయి. అవును అవే గుణాలు తెలుగు జాతికి మణిమకుటాలు అయ్యాయి. ఆయన కీర్తి కారణంగా ఇవాళ్టికీ ఆయన వంశం విరాజిల్లుతోంది. ఆ మూడక్షరాల పేరుకు ఆవేశం ఉంది.. ఆలోచన ఉంది.. మంచి చేశాక ఆనందించిన గుణం ఉంది. ఎన్టీఆర్ కారణంగా తెలుగు నేలల నుంచి మంచి నాయకులు వచ్చారు. చదువు, వివేకం తెలిసిన వారిని ఆయన గౌరవించారు. అదే గౌరవం మున్ముందు కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ బాగా చదువుకున్న వారంటే ఆ పార్టీలో ఓ మంచి ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కు తెలుగు అంటే అమితమయిన ప్రేమ.. ఆ ప్రేమ ఇప్పటి పాలకుల్లోనూ ఉండాలని కోరుకుంటూ.. వారికి మరో సారి ఇంకోసారి వందోసారి జన్మదిన శుభాకాంక్షలు.
– రత్నకిశోర్ శంభుమహంతి