ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు సీఎం అధికారిక నివాసంలో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయినట్లు సమాచారం. వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే మాట్లాడుతూ.. అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
అయితే కొందరు ఎమ్మెల్యేలు సమావేశానికి స్పందించలేదన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు చెందిన 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు ఎంత మంది సమావేశానికి హాజరయ్యారనే విషయంపై స్పష్టత లేదు.