ఇద్దరు ప్రయాణికులు విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులను దుర్భాషలాడారు. ఈ ఘటన, నిన్న దుబాయ్ నుంచి ముంబై కి వస్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకుంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ , కొల్హాపూర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఏడాదిపాటు గల్ఫ్ లో పనిచేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గల్ఫ్‌లో బయలుదేరే ముందు వారు అక్కడి డ్యూటీ ఫ్రీ షాపు లో మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత వారు అదే విమానంలో మద్యం సేవించారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. వారిపై, వీరు ఇద్దరు దుర్భాషలాడారు. నిందితుల్లో ఒకరు బాటిల్ చేతిలో పట్టుకుని విమానంలో నిర్లక్ష్యంగా నడుస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు.
దీంతో.. విమానంలోని సిబ్బంది అతడి చేతిలోని మద్యం బాటిల్‌ను బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది. విమానం ముంబైలో లాండ్ అయిన అనంతరం ఈ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినందుకు గానూ ఇండియన్ పీనల్ కోడ్ 336 (ఇతరుల ప్రాణాలకు, భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు)తో పాటూ ఎయిర్ క్రాప్ట్ రూల్స్‌లోని 21, 22, 25 నిబంధనల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.